Ramoji Rao Son Kiran: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతికి కదలిక వచ్చింది. ఫలితాలు వచ్చిన వెంటనే జంగిల్ క్లియరెన్స్ ప్రారంభించారు. గత ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యంగా విడిచిపెట్టడంతో అడవిలా మారింది ఆ ప్రాంతం. కానీ జూన్ 4 న ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచి వందలాది యంత్రాలతో జంగిల్ క్లియరెన్స్ పనులు మొదలుపెట్టారు. చంద్రబాబు బాధ్యతలు చేపట్టాక అమరావతి ప్రాంతాన్ని సందర్శించారు. నాడు శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఆ నేలను ముద్దాడారు. అమరావతిని అత్యున్నత రాజధానిగా మార్చేందుకు కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. రామోజీరావు మృతితో.. ఆయనకు అమరావతి తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు చంద్రబాబు. రాజధానికి అమరావతి పేరు పెట్టడానికి రామోజీరావు కారణమని.. పేరు పెట్టకముందే ఈనాడులో ప్రత్యేక కథనం రాసి.. అమరావతి ప్రాశస్త్యాన్ని చాటి చెప్పిన మహనీయుడుగా అభివర్ణించారు.
అమరావతి రాజధాని కి మద్దతుగా ఈనాడు నిలుస్తూ వచ్చింది. గత ఐదు సంవత్సరాలుగా రాజధాని రైతుల పక్షం నిలిచింది. అందుకే రామోజీ సంస్కరణ సభలో రామోజీరావు తనయుడు, ఈనాడు ఎండి కిరణ్ కీలక ప్రకటన చేశారు. అమరావతి అభివృద్ధి కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు. రామోజీరావు సమస్మరణ సభను ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. విజయవాడలోని కానూరులో సభను ఏర్పాటు చేసింది. ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు హాజరయ్యారు. సంస్మరణ సభను ఏపీ ప్రభుత్వం అధికారికంగా చేపట్టినందుకు రామోజీరావు తనయుడు కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు.
వాస్తవానికి రామోజీరావు ప్రచారానికి దూరంగా ఉండేవారు. తాను ఏం పని చేసిన ప్రజలకు ఉపయోగపడుతుందా? లేదా? అన్నది మాత్రమే చూడాలని చెప్పే వారిని గుర్తు చేశారు చంద్రబాబు. అమరావతి రాజధాని నిర్మాణానికి రామోజీరావు బలమైన సంకల్పంతో ఉండేవారని.. రాజధాని నిర్మాణానికి ఎంతో పరితపించేవారని.. నవ్యాంధ్ర రాజధాని పేరు అమరావతిని సూచించింది రామోజీరావు అని చంద్రబాబు గుర్తు చేశారు. ఇదే సభలో ఈనాడు ఎండి కిరణ్ అమరావతి అభివృద్ధి కోసం ఈనాడు సంస్థల తరఫున 10 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. దేశంలోనే గొప్ప నగరంగా అమరావతి వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులంతా కలిసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రామోజీరావు కుటుంబ సభ్యులను అభినందించారు. అమరావతిలో రామోజీరావు జ్ఞాపకార్థం విగ్రహం ఏర్పాటు చేస్తామని కూడా చంద్రబాబు సభాముఖంగా ప్రకటించారు.