Amaravati: బాబు వచ్చాడు.. అమరావతి కోసం ఆస్ట్రేలియా వచ్చింది

అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అభివృద్ధికి ఉన్న ఛాన్స్ లపై చర్చించేందుకు ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సిలై జాకీ నేతృత్వంలోని ఓ బృందం పర్యటించింది.

Written By: Dharma, Updated On : June 28, 2024 11:16 am

Amaravati

Follow us on

Amaravati: అమరావతికి కొత్త వెలుగు వచ్చింది. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. దీంతో వరుసగా అమరావతికి శుభవార్తలు అందుతున్నాయి. గతంలో పనులు చేపట్టిన సంస్థలు.. ఇప్పుడు సైతం ఆసక్తి చూపుతున్నాయి. వైసిపి మూడు రాజధానులు తెరపైకి తేవడంతో.. అమరావతి నిర్మాణ పనుల నుంచి ఒక్కో సంస్థ నిష్క్రమించింది. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రావడంతో అవే సమస్యలు క్యూ కొడుతున్నాయి. విదేశీ సంస్థలు కూడా రాజధానిలో నిర్మాణ అవకాశాలపై ఆరా తీయడం మొదలుపెట్టాయి. ఇప్పటికే చాలామంది విదేశీ పారిశ్రామికవేత్తలు సీఎం చంద్రబాబును కలిసి తమ ఆసక్తిని కనబరిచినట్లు తెలుస్తోంది.

అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అభివృద్ధికి ఉన్న ఛాన్స్ లపై చర్చించేందుకు ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ సిలై జాకీ నేతృత్వంలోని ఓ బృందం పర్యటించింది. ఇటీవల సిఆర్డిఏ కమిషనర్ గా నియమితులైన కాటమనేని భాస్కర్ తో ఈ బృందం చర్చలు జరిపింది. అమరావతిలో పెట్టుబడులు పెడితే ఉన్న వాణిజ్య అవకాశాలపై చర్చించింది ఆ బృందం. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం ఉంటుందన్న దానిపై ఆరా తీసింది. ప్రభుత్వం నుంచి భూ కేటాయింపులు, రాయితీలు కల్పిస్తే ఆస్ట్రేలియా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉందని కూడా ఈ బృందం చెబుతోంది.

2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి సర్కార్.. ఆలస్యంగా రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించింది. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం తో పాటు కొన్ని భవనాలు మాత్రమే నిర్మించి వదిలేయడంతో స్వదేశీ, విదేశీ పారిశ్రామికవేత్తలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాని పరిస్థితి. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం పూర్తిగా అమరావతికి మద్దతుగా ఉండడంతో.. ప్రభుత్వం నుంచి భరోసా ఉండడంతో తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. అదే విషయాన్ని ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ కు వివరించారు సిఆర్డిఏ కమిషనర్ భాస్కర్. ప్రస్తుతం అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని వారికి వివరించారు. అమరావతిలో తగినంత భూమి అందుబాటులో ఉందని.. పెట్టుబడులు పెడితే ప్రయోజనం ఉంటుందని హామీ ఇచ్చారు. తమకు ప్రభుత్వం వైపు నుంచి ప్రోత్సాహకాలు లభిస్తే విదేశీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమని ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో ఫుల్ క్లారిటీ రానున్నట్లు సమాచారం.