Ramoji Rao Passed Away: విశాఖ నుంచే ఈనాడు రామోజీ మీడియా ప్రయాణం

పచ్చళ్ళ వ్యాపారంతో ప్రారంభమై.. మీడియా రంగంలో అడుగుపెట్టి.. మీడియా మొఘల్ గా మారారు రామోజీ. 1974 ఆగస్టు 10న విశాఖ నగరంలోని నక్కవానిపాలెంలో ఈనాడు తొలి కార్యాలయాన్ని ప్రారంభించారు.

Written By: Dharma, Updated On : June 8, 2024 8:50 am

Ramoji Rao Passed Away

Follow us on

Ramoji Rao Passed Away: ఇండియాలోనే టాప్ మీడియా ఈనాడు. వార్తా ప్రపంచంలోనే సరికొత్త పోకడలతో దూసుకుపోయింది ఈనాడు. వార్తాపత్రిక డోర్ డెలివరీ వ్యవస్థకు పునాది వేసింది రామోజీరావు. ఈనాడు పత్రికను స్థాపించి అనతి కాలంలోనే తెలుగు ప్రజలకు ఇష్టమైన పేపర్ గా మలచడంలో రామోజీరావు కృషి చాలా ఉంది. విశాఖ నగరంలో 1974లో ప్రారంభమైంది ఈనాడు ప్రస్థానం. అప్పటివరకు ఉన్న పత్రికలకు ధీటుగా ఈనాడును మలచడంలో రామోజీరావు శరవేగమైన ఆలోచనలు ఉన్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా, ప్రజల అభిరుచులకు తగ్గట్టు, పాఠక ఆసక్తి పెంపొందించే విధంగా పత్రికను కొత్త పుంతలు తొక్కించారు. తెలుగు ప్రజల అభిమానాన్ని పొందగలిగారు.

పచ్చళ్ళ వ్యాపారంతో ప్రారంభమై.. మీడియా రంగంలో అడుగుపెట్టి.. మీడియా మొఘల్ గా మారారు రామోజీ. 1974 ఆగస్టు 10న విశాఖ నగరంలోని నక్కవానిపాలెంలో ఈనాడు తొలి కార్యాలయాన్ని ప్రారంభించారు. 5000 కాపీలతో ఈనాడు ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. పత్రికలో విప్లవాత్మక మార్పులకు పునాది వేశారు. హైయెస్ట్ సర్క్యులేషన్ పత్రికగా తీర్చిదిద్దారు. మారుతున్న కాలానికి అనుగుణంగా, అన్ని వర్గాల వారికి సమాచారం అందేలా ఈనాడును మలచడంలో రామోజీరావు కృషి ఉంది.

1995లో టెలివిజన్ రంగంలో అడుగు పెట్టారు రామోజీరావు. ఈటీవీ చానల్ ను ప్రారంభించారు. ‘ఈటీవీ మీటీవీ’ స్లోగన్ తో ప్రతి ఇంటా వినోదాన్ని పంచారు. అప్పటివరకు దూరదర్శన్ కే పరిమితమైన ధారావాహికలు, సీరియల్స్ ను ఈటీవీలో ప్రసారం చేయడం ప్రారంభించారు. ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం తో పాడుతా తీయగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్నెన్నో ప్రజాదరణ కలిగిన ఈవెంట్లకు ఈటీవీ ప్లాట్ ఫామ్ గా నిలిచింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, ఆలీతో జాలీగా.. ఇలా ఒకటేమిటి ఎన్నో రకాల వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగింది ఈటీవీ. 2003లో ఈటీవీ 2 పేరిట తెలుగు రాష్ట్రాల్లో తొలి 24 గంటల వార్త ఛానల్ ను తీసుకొచ్చారు రామోజీ. 2014 రాష్ట్ర విభజనతో ఈటీవీ ఏపీ, ఈటీవీ తెలంగాణగా మార్చారు. తెలుగు పత్రికా రంగంలో చాలామంది ఈనాడును దాటి వెళ్లాలని ప్రయత్నించారు. కానీ వీలు కాలేదు. దానికి రామోజీ బలమైన పునాదులు వేయడమే కారణం.