AP Elections 2024: ఏపీలో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం పైనే ఉంది. ఎన్నికల ప్రచారం గడువు ముగిసిన నేపథ్యంలో పిఠాపురంలో టెన్షన్ నెలకొంది. ఒకవైపు పవన్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీ, మరోవైపు వైసీపీ అభ్యర్థి వంగా గీతకు మద్దతుగా సీఎం జగన్ పిఠాపురంలో అడుగు పెట్టేసరికి.. హై టెన్షన్ నెలకొంది.అయితే భారీ బల ప్రదర్శనకు దిగాలని జగన్ భావించారు. కానీ మెగా ఫ్యామిలీ ఎంట్రీ తో అనుకున్న స్థాయిలో వైసిపి బల ప్రదర్శన చేయలేకపోయింది. అదే సమయంలో జనసేన మాత్రం ఓ స్థాయిలో సౌండ్ చేసింది. పోలింగ్కు ముందు గట్టి సవాల్ పంపింది.
పిఠాపురంలో ఈసారి పవన్ గెలుపు ప్రతిష్టాత్మకం. అందుకే మెగా ఫ్యామిలీతో పాటు ఆయనను అభిమానించే బుల్లితెర నటులు గత కొద్దిరోజులుగా పిఠాపురంలోనే మకాం వేశారు. పవన్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు తెలుగు చిత్ర పరిశ్రమ నటులు, ప్రముఖులు పవన్ కు మద్దతు ప్రకటించారు. ప్రభాస్ పెద్దమ్మ, దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి జనసేనకు మద్దతుగా ప్రచారం కూడా చేశారు. మెగా ఫ్యామిలీకి సంబంధించి వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ నేరుగా ప్రచారం చేయగా.. తమ్ముడిని గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరుతూ చిరంజీవి ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే పవన్ కు మద్దతుగా పిఠాపురం చిరంజీవి వస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్,ఆమె తల్లి సురేఖ, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ లు పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ ను కలిశారు. తమ మద్దతును ప్రకటించారు.
హైదరాబాద్ నుంచి ఆ ముగ్గురు ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకున్నారు. అక్కడ మెగా కుటుంబ సభ్యులకు బుల్లితెర నటుడు, హైపర్ ఆది స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారు రోడ్డు మార్గంలో పిఠాపురం చేరుకున్నారు. పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అడుగడుగునా మెగా అభిమానులు పూలు చల్లుతూ అభిమానాన్ని చాటుకున్నారు. పిఠాపురంలో రామ్ చరణ్ బాబాయి పవన్ కళ్యాణ్ ను కలిశారు. పవన్ నివాసం వద్ద బయటకు వచ్చిన బాబాయ్ అబ్బాయి ప్రజలకు అభివాదం చేశారు. దీంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు మెగా అభిమాన సంఘాల కీలక నేతలతో రామ్ చరణ్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. కీలక సూచనలు చేశారు. మొత్తానికైతే మెగా కుటుంబం పిఠాపురంలో పవన్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.