Raksha Bandhan Emotional Story: సోదర బంధానికి ప్రతీక రక్షాబంధన్( Raksha Bandhan ). ప్రతి ఇంట ఈరోజు అన్నాచెల్లెళ్ల సందడి కనిపిస్తుంది. సోదరుడు లేకపోతే.. సమీప బంధువులు, స్నేహితుల్లో ఒకరికి రాఖీ కట్టి సంబర పడతారు. సోదరీ లేకుంటే.. సోదరి సమానులైన వారితో రాఖీ కట్టించుకుంటారు. అయితే ఆ ఇంట మాత్రం అందుకు భిన్నం. దేశ రక్షణలో సోదరుడు అమరుడు కాగా.. ఆయన సేవలకు గుర్తుగా విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేశారు. ఆ విగ్రహానికి ఏటా సోదరి రాఖీ కడుతూ.. తన అన్నయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. తమ మధ్య ఉండే అనురాగం, అనుబంధం గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతం అవుతారు ఆ సోదరి.
సరిగ్గా 20 ఏళ్ల కిందట..
కడప జిల్లా( Kadapa district ) ఒంటిమిట్ట మండలం రాచపల్లి కు చెందిన కొండూరు జయరామరాజు, సరోజనమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో కొండూరు యుగంధర్ ఒక్కరు. చిన్నప్పటినుంచి దేశభక్తి ఎక్కువ. ఆర్మీలో సైనికుడిగా ఎంపికయ్యారు. అధికారుల ఆదేశాలతో కైలాస పర్వతాన్ని అధిరోహించి.. అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా సాహస వీర పురస్కారం అందుకున్నారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఒకటైన చౌ కుంభ 1 పర్వత శిఖరం పై జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. తిరుగు ప్రయాణంలో అకస్మాత్తుగా కొండ చర్యలు విరిగిపడడంతో లోయలో పడిపోయారు. 2005 ఆగస్టు 30న అమరుడయ్యారు.
Also Read: ఆ ఐదుగురిని నమ్ముకున్న జగన్!
ఆ అనుబంధంతో..
అయితే తన అన్నయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని చెల్లెలు గాయత్రి ( Gayatri)విగ్రహం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. గ్రామంలో ప్రధాన రహదారి పక్కనే సోదరి విగ్రహాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించారు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయి. దీంతో ఏడు అడుగుల సోదరుడి విగ్రహాన్ని తయారు చేయించి ఆవిష్కరించారు. తన సొంత నిధులను వెచ్చించి మండపాన్ని నిర్మించారు. ఏటా శ్రావణమాసంలో రాఖీ పౌర్ణిమ సందర్భంగా అన్న చిత్రపటం, విగ్రహం చేతికి రాఖీ కడుతూ తమ బంధాన్ని గుర్తు చేసుకుంటారు గాయత్రి.