Chandrababu Rajya Sabha Candidate Selection: ఏపీలో( Andhra Pradesh) రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. జూన్లో ఏపీ నుంచి నలుగురు రాజ్యసభకు పదవీ విరమణ చేయనున్నారు. వారి స్థానంలో కొత్త వారి ఎంపికకు ఎలక్షన్ కమిషన్ సన్నాహాలు ప్రారంభించింది. ఏ క్షణం అయినా దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనుంది. కూటమికి ఏకపక్ష విజయం దక్కడంతో ఈ నాలుగు స్థానాలు కూడా కూటమి ఖాతాలోనే పడనున్నాయి. తెలుగుదేశం పార్టీకి రెండు రాజ్యసభ స్థానాలు దక్కడం పక్కా. మిగతా రెండు పదవులను మాత్రం జనసేన ఒకటి, బిజెపి ఒకటి దక్కించుకుంటుంది. అయితే తెలుగుదేశం పార్టీలో మాత్రం ఎక్కువగా ఆశావహులు ఉన్నారు. జూనియర్లతో పాటు సీనియర్లు సైతం ఈ పదవి ఆశిస్తున్నారు. కానీ రకరకాల సమీకరణలను పరిగణలోకి తీసుకొని పదవి కేటాయించే అవకాశం ఉంది.
* నలుగురు పదవీ విరమణ..
ఏపీ నుంచి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళనత్వాని, సానా సతీష్ పదవీ విరమణ చేయనున్నారు. అయితే టిడిపి నుంచి ఎన్నికైన సానా సతీష్ కు మరోసారి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఏడాది కిందట రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పట్లోనే రెన్యువల్ ఉంటుందని చెప్పి ఆయనను ఎంపిక చేశారు. దీంతో మిగిలేది టిడిపికి ఒక్క పదవి మాత్రమే. దాదాపు డజన్ మందికి పైగా ఆశావహులు ఉన్నారు. అయితే చంద్రబాబు తో పాటు లోకేష్ చింతకాయల విజయ్ వైపు మొగ్గు చూపినట్లు ప్రచారం నడుస్తోంది. గత 17 సంవత్సరాలుగా విజయ్ తెలుగుదేశం పార్టీకి విశేష సేవలు అందిస్తున్నారు. అందుకే ఆయన వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ఆపై బీసీ నేత కావడం.. యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తుండడం విజయ్ కు కలిసి వచ్చే అంశంగా తెలుస్తోంది.
* టిడిపికి బలమైన కుటుంబం..
చింతకాయల అయ్యన్నపాత్రుడు అంటేనే టిడిపిలో ఒక ఫైర్ బ్రాండ్. పార్టీ ఆవిర్భావం నుంచి ఆ కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ వస్తోంది. 1983 నుంచి 2024 వరకు.. మధ్యలో రెండు సార్లు మాత్రమే అయ్యన్నపాత్రుడు ఓడిపోయారు. మధ్యలో ఒకసారి అనకాపల్లి ఎంపీ కూడా అయ్యారు. అయితే తండ్రి మాదిరిగానే విజయ్ సైతం తెలుగుదేశం పార్టీ విధానాల పట్ల, సిద్ధాంతాల పట్ల విపరీతమైన అభిమానం. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే దూకుడుతో ముందుకు సాగారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాను హ్యాండిల్ చేశారు. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విజయ్ పై ఎన్నో కేసులు పెట్టింది. అరెస్టులు కూడా చేయడానికి ప్రయత్నం చేసింది. వాటన్నింటినీ తట్టుకొని నిలబడగలిగారు. ప్రస్తుతం అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. అయితే ఇప్పుడు విజయ్ కు రాజ్యసభకు ఎంపిక చేయడం ఖాయంగా తెలుస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో చూడాలి.