Pawan Kalyan: ఏపీలో ఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ విడుదల కాకముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నారు. అనుకూల మీడియాల్లో అడ్డగోలుగా కథనాలు ప్రసారం చేయిస్తున్నారు. ప్రచురిస్తున్నారు. ఈ కథనాలను ఆయా పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా విభాగాలు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాయి.. అయితే ఈ పరంపరలో జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రిక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఒక కథనాన్ని ప్రచురించింది. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ.. తేదీలతో సహా చెబుతూ..ఏపీ ఎడిషన్ లోపలి పేజీల్లో కథనాన్ని ప్రచురించింది.
“పవన్ కళ్యాణ్ పలుసార్లు మాట తప్పాడు. ఎన్నోసార్లు పొత్తులు పెట్టుకున్నాడు. ఆయన కూడా చంద్రబాబు నాయుడు ను అనుసరిస్తున్నాడు.. రాజధాని విషయంలో ఒకప్పుడు ఒకలాగా.. ఇంకోసారి మరోలాగా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెరపైకి తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థను విమర్శించాడు. నాలుక మడత పెట్టడంలో ఆరితేరిపోయాడు” అంటూ సాక్షి “బ్రో డైలాగ్ మారింది” అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. పవన్ కళ్యాణ్ రాజధాని విషయంలో అనేక మాటలు మాట్లాడారని.. చంద్రబాబు నాయుడి పై ఒకప్పుడు విమర్శలు చేశారని.. తర్వాత కలిసిపోయారని.. ఇలా పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలన్నింటిని తేదీలతో సహా సాక్షి ప్రచురించింది.
కాకపోతే రాజకీయ నాయకులు అన్నాక మాట మీద నిలబడతారని.. విశ్వసనీయతకు పెద్దపీటవేస్తారని సాక్షి ఎలా అనుకుంది? ఆ ప్రకారం చూసుకుంటే ఏపీకి హోదా తీసుకొస్తానని గత ఎన్నికల ముందు జగన్ ప్రకటించారు. ఇంకా అనేక రకాలైన హామీలు ఇచ్చారు. వాటన్నిటిని ఆయన అమలు చేశారా? కేవలం పవన్ కళ్యాణ్ విషయంలోనే భూతద్దం పెట్టి చూస్తున్న సాక్షి.. మిగతా విషయాలను ఎందుకు ప్రస్తావించదు? పవన్ కళ్యాణ్ నడిపేది ఒక రాజకీయ పార్టీ కాబట్టి.. తన ప్రయోజనాలకు అనుగుణంగానే ఆయన అడుగులు ఉంటాయి.. ఇక్కడ పవన్ కళ్యాణ్ అన్నిసార్లు మాట తప్పొచ్చా అనే ప్రశ్నలు వ్యక్తం కావచ్చు. అందులో తప్పులేదు. కానీ పవన్ కళ్యాణ్ తను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నారు. వెనక్కి తీసుకోలేదు. నాడు చంద్రబాబు నాయుడు తో కలిసి ప్రయాణం సాగించారు. అప్పట్లో సీట్లు గాని, మంత్రి పదవులు గాని పవన్ కళ్యాణ్ ఆశించలేదు. 2019 ఎన్నికల్లోనూ ఇతర పార్టీ ల్లాగా ధన ప్రవాహాన్ని కొనసాగించలేదు. అలాంటప్పుడు సాక్షి చెప్పినట్టు మాట తప్పడం ఎలా అవుతుంది.. ఈ కోణాలు సాక్షికి కనిపించవు. కనిపించినప్పటికీ అది రాయలేదు.
