AP Rains: దేశవ్యాప్తంగా ఇప్పుడు వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. వీటికి తోడు బంగాళాఖాతంలో( Bay of Bengal ) ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం నాటికి మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తాజా పరిస్థితులతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని స్పష్టం చేసింది.
* ఈ జిల్లాలకు వర్ష సూచన..
నేడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రధానంగా శ్రీకాకుళం( Srikakulam ), విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో సైతం వర్షాలు ఉంటాయని హెచ్చరిస్తోంది. వర్షాలు పడే ప్రాంతాల్లో గాలుల ప్రభావం కూడా ఉంటుందని తెలుస్తోంది. ప్రధానంగా ఉత్తర కొస్తాకు ఎక్కువగా వర్ష సూచన ఉండడం విశేషం. రుతుపవనాల విస్తరణకు ఇదే సరైన సమయం అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
* ముందుగానే రుతుపవనాలు..
సాధారణంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతోనే దేశవ్యాప్తంగా ఖరీఫ్( kharif) సాగు ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలోనే ఉపరితల ఆవర్తనాలతో పాటు తుఫాన్లు ఏర్పడుతుంటాయి. వాటి ప్రభావంతో వర్షం అధికంగా పడుతూ ఉంటుంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు దేశానికి ముందే తాకాయి. వారం రోజులు ముందుగానే ప్రవేశించాయి. ఏపీకి సైతం ముందస్తుగా పలకరించాయి. దీంతో విస్తారంగా వర్షాలు పడ్డాయి. అయితే జూన్ మొదటి వారం తర్వాత క్రమేపి రుతుపవనాల విస్తరణ తగ్గింది. దీంతో వర్షాలు కూడా తగ్గుముఖం పట్టాయి.
* బంగాళాఖాతం నుంచి హెచ్చరికలు..
అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల్లో కదలిక వచ్చింది. దీంతో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా బంగాళాఖాతం, సమీప తీర ప్రాంతాల్లో ఎక్కువగా ఉపరితల ఆవర్తనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఏడాది భారీ వర్షాలు( heavy rain ) ఉంటాయని ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోస్తాంధ్రలో వర్ష ప్రభావం ఉండడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మత్స్యకారులకు ముందు జాగ్రత్త చర్యగా వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు ఇచ్చారు.