AP Rain Alert: ఏపీలో వాతావరణంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చలి వణికిస్తోంది. పొగ మంచు కురుస్తోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభమవుతున్న ఈ పొగ మంచు ఉదయం 10 గంటల వరకు విడిచిపెట్టడం లేదు. మన్యంలో రోజంతా మంచు దుప్పటి కప్పేస్తోంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. శ్రీలంక సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందట. 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరానికి చేరుతుందట. ఇది తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
* తమిళనాడు పై ప్రభావం..
ప్రధానంగా ఈ వాయుగుండం ప్రభావం తమిళనాడు పై ప్రభావం చూపుతుంది. అక్కడ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ పై అంత ప్రభావం చూపదని కూడా చెబుతున్నారు. ఉంటే గింటే తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం దట్టమైన పొగ మంచు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. కానీ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో శనివారం దక్షిణ కోస్తా తో పాటు రాయలసీమ జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు పడుతాయి అంటున్నారు. మిగిలిన చోట్ల మాత్రం ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెబుతున్నారు.
* విశాఖ మన్యం గజ గజ..
రాష్ట్రవ్యాప్తంగా చలి పంజా విసురుతోంది. విపరీతమైన పొగ మంచు కురుస్తోంది. ఏజెన్సీ ప్రాంతం అయితే వనికి పోతోంది. మన్య ప్రాంతంలో చలి తీవ్రత అధికంగా ఉంది. పాడేరుతో సహా అనేక ఏజెన్సీ ప్రాంతాలలో దట్టమైన పొగ మంచు అమ్మేస్తోంది. పొగ మంచు కారణంగా వాహనదారులు రహదారులపై రాకపోకలు సాగించడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం పూట కూడా లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి. విశాఖ మన్యప్రాంతమైన ముంచంగిపుట్టులో అత్యల్పంగా 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. విశాఖ మన్య ప్రాంతం చలితో విలువలడుతోంది. ఈ నెలాఖరు వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.