Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో( Telugu States) విచిత్ర వాతావరణ పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు ఎండలు మండుతూనే.. మరోవైపు వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ఈ క్రమంలో ఏపీలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడంతో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడుతున్నాయి. వాటి ప్రభావంతోనే వాతావరణం లో మార్పులు కనిపిస్తున్నాయి. వర్షాలు పడుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
* అరేబియాలో అల్పపీడనం
తూర్పు మధ్య అరేబియా( Arabia ) సముద్రంలో.. దక్షిణ కొంకన్ తీరానికి సమీపంలో వాయుగుండం ఏర్పడింది. ఇది క్రమేపీ తూర్పు వైపునకు కదులుతోంది. అందుకే ఏపీకి భారీ వర్షం సూచన ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ఇది రత్నగిరి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో నేడు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. రేపు అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్య సాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షంతో పాటు తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఆ సమయంలో హోర్డింగులు, చెట్లు వద్ద, శిధిల భవనాల కింద ఉండొద్దని హెచ్చరించింది. పిడుగులతో కూడిన వర్షం నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
* ముందుగానే రుతుపవనాలు..
నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే పలకరించాయి. 8 రోజులు ముందుగానే కేరళకు ( Kerala ) తాకాయి. 16 సంవత్సరాల తరువాత తొలిసారిగా.. వేగంగా రుతుపవనాలు రావడంతో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అండమాన్ నికోబార్ దీవులకు ఈనెల 13న రుతుపవనాలు తాకాయి. క్రమేపీ విస్తరించడంతో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. ఇంకోవైపు నైరుతి రుతుపవనాల ఆగమనంతో.. తుఫాన్లు సంభవించే అవకాశం ఉంది. తొలకరి వానలు పడడంతో రైతులు వరి నారుమల్లు సిద్ధం చేసుకునే పనిలో పడుతున్నారు.