Railway Koduru Ticket Issue: రిజర్వుడు నియోజకవర్గాల విషయంలో తెలుగుదేశం పార్టీపై ఒక విమర్శ కొనసాగుతోంది. మొన్న తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అసెంబ్లీ టికెట్ కోసం విజయవాడ ఎంపీ కేసినేని చిన్నికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనిపై చంద్రబాబు ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారో నన్న చర్చ నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే టిడిపి మహిళా నేత ఒకరు టికెట్ కోసం ఏడు కోట్ల రూపాయలు ఇచ్చానని సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఉమ్మడి వైయస్సార్ కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ టికెట్ ఇప్పిస్తానని పార్టీకి చెందిన ఎన్నారై వేమన సతీష్ ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నట్లు దళిత నాయకురాలు సుధా మాధవి సంచలన ప్రకటన చేశారు.
గతంలో యాక్టివ్ గా ఉండేవారట..
తెలుగుదేశం పార్టీకి చెందిన సుధా మాధవి చాలా యాక్టివ్ గా ఉండేవారట. గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో 53 రోజులపాటు ఆమె నిరాహార దీక్ష చేసినట్లు చెబుతున్నారు. అయితే ఆమె 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రైల్వే కోడూరు టికెట్ ఆశించారట. టికెట్ ఇప్పిస్తానని చెప్పి వేమన సతీష్ ఆమె వద్ద ఏడు కోట్ల రూపాయలు తీసుకున్నారట. అయితే ఈ విషయం రైల్వే కోడూరు టిడిపి నాయకులు చంగల్రాయుడు, జగన్మోహన్ రాజు, విశ్వనాథ నాయుడుకి తెలుసునని చెబుతున్నారు. ఆస్తులతోపాటు ఇల్లు కూడా అమ్మిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
ఇన్ని రోజులు ఏం చేసినట్టు?
ఎన్నికలు జరిగి దాదాపు 18 నెలలు అవుతోంది. ఇప్పుడు ఆమె ఈ విషయం బయట పెట్టడం విశేషం. ఇటీవల జరుగుతున్న పరిణామాల నడుమ ఈ విషయం బయటకు రావడం అనుమానాలకు తావిస్తోంది. పైగా ఆమె ఒక సామాన్య మహిళ. టికెట్ కోసం ఏడు కోట్ల రూపాయలు ఇచ్చారంటే నమ్మశక్యం కావడం లేదు. పైగా ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న జడ శ్రావణ్ కుమార్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించి ఈ విషయం బయట పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి అందులో ఎంత వాస్తవం ఉందో వారికే తెలియాలి.