Raghu Ramakrishnam Raju : ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా సీనియర్ నేత రఘురామకృష్ణంరాజు బాధ్యతలు స్వీకరించారు.ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రఘురామ.మంత్రి పదవి ఆశించారు కానీ.. సమీకరణల్లో భాగంగా ఆయనకు ఛాన్స్ దక్కలేదు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. బాధ్యతలు స్వీకరించిన ఆయన భావోద్వేగంతో మాట్లాడారు. వైసిపి ఎంపీగా ఉంటూ తనను సొంత ప్రభుత్వమే అరెస్టు చేసిన వైనాన్ని ప్రస్తావిస్తూ కొద్దిపాటి భావోద్వేగానికి గురయ్యారు. తనను అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో చంద్రబాబు తనకు అండగా నిలబడ్డారని..తన కుటుంబాన్ని ఓదార్చారని గుర్తు చేశారు. చంద్రబాబుకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసని.. ఎప్పుడు న్యాయం చేయాలో కూడా తెలుసునని.. అందుకు కానీ ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ తో పాటు మూడు పార్టీల ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.
* సంచలన కామెంట్స్
వైసిపి అధినేత జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణంరాజు.సభకు రావాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. మైక్ ఇవ్వరని బయట ఉండి చెప్పడం కాదని.. సభలోపలికి వచ్చి చూడాలని సూచించారు. చంద్రబాబు మీ మాదిరిగా అవమానించే వ్యక్తి కాదని చెప్పుకొచ్చారు. సభలో గౌరవంగా మిమ్మల్ని చూసుకుంటామని.. ప్రతిపక్ష నేత హోదా కోసం మారం చేయడం మాని.. సభలోకి బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా రావాలని ఆహ్వానం పలికారు రఘురామకృష్ణంరాజు. అగౌరవపరిచే వ్యక్తి చంద్రబాబు కాదని..మీకు అన్ని విధాల గౌరవం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పుకొచ్చారు. అయితే పాత పగలు, గత పరిణామాలను మరిచి కూడా రఘురామకృష్ణంరాజు జగన్ ను సభలోకి ఆహ్వానించడం విశేషం.
* గత ఐదేళ్లుగా పరిణామాలు
2019లో నరసాపురం పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు రఘురామకృష్ణంరాజు.ఆ ఎన్నికల్లో గెలిచారు కూడా. అయితే అక్కడకు ఆరు నెలలకి పార్టీతో పాటు అధినేతకు దూరమయ్యారు. విభేదించడం ప్రారంభించారు. రచ్చబండ పేరుతో ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టేవారు. ఈ క్రమంలో జగన్ సర్కార్ ఆయన పై రాజద్రోహం కేసు పెట్టింది. హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకొచ్చి విచారణ పేరిట పోలీసులతో దాడి చేయించింది. ఈ తరుణంలో సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ పొందారు రఘురామ. ఆ సమయంలో చంద్రబాబు తనకు అండగా నిలిచారని తరచూ గుర్తు చేసుకుంటారు. అయితే అప్పట్లో అవమానకర రీతిలో నియోజకవర్గానికి కూడా రఘురామను దూరం చేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు స్పీకర్ కావాలని ఉందని రఘురామ చెప్పుకొచ్చారు. అంటే అధ్యక్షా అని పిలిపించుకోవడం తనకు ఇష్టమని జగన్ ను ఉద్దేశించి అన్నారు రఘురామ. దీంతో పాత పగ ఉందని అంతా భావించారు. కానీ ఇప్పుడు రఘురామ మాటలు చూస్తుంటే మాత్రం ముచ్చటేస్తోంది. ఆయన మారిపోయారన్న భావన కనిపిస్తోంది.