Raghurama krishnam Raju Latest News: రాజకీయాల్లో ఒక పదవిపై వ్యామోహం పెంచుకుంటే.. మరో పదవి దక్కినా అంత సంతృప్తిగా ఉండలేం. ఇప్పుడు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు( raghuramakrishna Raju ) పరిస్థితి అదే. ఆయనకు కేంద్ర రాజకీయాలంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే తో పాటు డిప్యూటీ స్పీకర్ గా ఉండేందుకు ఆయన ఇష్టపడడం లేదన్నట్టు ప్రచారం నడుస్తోంది. ఏదో తప్పదని ఆ పదవి స్వీకరించారే తప్ప.. తాను అనుకున్నది, కోరుకున్నది మాత్రం నరసాపురం ఎంపీ స్థానం. ఎన్నికల్లో చివరి నిమిషం అది దక్కకపోయేసరికి ఎమ్మెల్యేగా సర్దుబాటు చేయాల్సి వచ్చింది. చంద్రబాబు పిలిచి మరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆపై డిప్యూటీ స్పీకర్ ఇచ్చి క్యాబినెట్ హోదా కల్పించారు. కానీ రఘురామకృష్ణంరాజు మనసులో మాత్రం నరసాపురం ఎంపీ పదవి అలానే ఉండిపోయింది. ఎందుకంటే ఐదేళ్ల పదవీకాలంలో ఆయన ఎంపీగా హోదా వెలగబెట్ట లేకపోయారు.
ఆరు నెలలకే రెబల్ గా..
2019లో గెలిచిన రఘురామకృష్ణం రాజు ఆరు నెలలకే రెబల్ ఎంపీగా మారిపోయారు. దీంతో ఆయనపై ఎప్పుడు అనర్హత వేటు పడుతుందా అని వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ప్రయత్నం చేయడమే కాక ఎదురుచూసింది. ఆపై ఆయన నరసాపురం పార్లమెంట్ స్థానానికి దూరమయ్యారు కూడా. పేరుకే ఎంపీ కానీ సొంత నియోజకవర్గంలో కూడా పర్యటించలేని పరిస్థితికి వచ్చింది. అలా ఐదేళ్ల పదవీకాలం ముగిసింది. తిరిగి నరసాపురం ఎంపీ స్థానం నుంచి గెలిచి తన ప్రతాపం చూస్తానని రఘురామకృష్ణంరాజు భావించారు. కూటమిలో ఏదో ఒక పార్టీ తరఫున బరిలో దిగేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. కానీ ఆ ప్రయత్నం వికటించి నరసాపురం ఎంపీ సీటు పొత్తులో భాగంగా బిజెపికి దక్కింది. ఆ పార్టీ నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు.
చివరి నిమిషంలో షాక్..
అయితే చివరి నిమిషం వరకు బిజెపి( Bhartiya Janata Party) తరఫున పోటీ చేయాలనుకున్న రఘురామకృష్ణం రాజుకు షాక్ తగిలింది. అయితే ఐదేళ్లపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రెబెల్ గా మారి టిడిపి కూటమికి సహకరించారు రఘురామ. ఆయనకు సీటు ఇవ్వకపోతే ఇబ్బందికరమని భావించి చంద్రబాబు చివరి నిమిషంలో ఉండి శాసనసభ టికెట్ ఇప్పించారు. అప్పటికే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంతెన రామరాజు ఉన్నారు. ఆయనను ఒప్పించి రఘురామకృష్ణంరాజు టిక్కెట్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయనకు సరైన గౌరవం దక్కాలని భావించి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు. అయితే ఆ పదవిలో రఘురామకృష్ణం రాజు పెద్దగా సంతృప్తిగా లేరట. తనకు కేంద్ర రాజకీయాలంటే ఇష్టమని.. తిరిగి ఎంపీగా నరసాపురం వెళ్లిపోతానని సన్నిహితుల వద్ద చెబుతున్నారట. కానీ సిట్టింగ్ ఎంపీగా, ఆపై కేంద్ర మంత్రిగా ఉన్నారు భూపతి రాజు శ్రీనివాస వర్మ. ఆయనను పక్కన పెట్టి రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఎలా ఇస్తారన్నది ఇప్పుడు ప్రశ్న. కానీ తనకు ఎంపీగా వెళ్లిపోవడం ఇష్టమని.. ఏదో విధంగా 2029 ఎన్నికల్లో నరసాపురం స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని చెబుతున్నారు రఘురామకృష్ణంరాజు. కానీ ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.