Raghuramakrishnam Raju: రఘురామకృష్ణం రాజు( Raghu Ramakrishnan Raju ).. తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. అలాగని ఆయన ఎన్నో పదవులు చేపట్టలేదు. ఒకసారి ఎంపీ అయ్యారు.. మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో డిప్యూటీ స్పీకర్ అయ్యారు. అయితే ఏపీలో విపరీతమైన పాపులారిటీ సాధించడంలో మాత్రం ముందున్నారు రఘురామకృష్ణంరాజు. అయితే తనకు రాజకీయాలు సంతృప్తినివ్వలేదని.. తానొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటూ తనకు తాను చెప్పుకున్నారు రఘురామకృష్ణంరాజు. వైసీపీలో అలా జరిగింది. ఇప్పుడు కూటమి హయాంలో ఇలా జరిగింది అని చెప్పుకునే క్రమంలో ఫెయిల్యూర్ అనే పదాన్ని వినియోగించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే రఘురామకృష్ణం రాజు ప్రస్థానాన్ని గమనిస్తే మాత్రం.. ఆయన అనుకున్న లక్ష్యానికి చేరువ కాలేదని ఆయన మాటలు బట్టి అర్థమవుతోంది.
* కాంగ్రెస్ మనిషిగా..
కాంగ్రెస్ ( Congress) పార్టీలో సుదీర్ఘకాలం వున్నారు రఘురామకృష్ణంరాజు. వైయస్ రాజశేఖర్ రెడ్డితో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. కానీ చట్టసభలకు రావాలన్న ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఆశించారు. కానీ ఆయనకు అవకాశం చిక్కలేదు. 2019 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా నరసాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. కొద్ది రోజులకే అధినేత జగన్మోహన్ రెడ్డిని విభేదించడం ప్రారంభించారు. 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన టిడిపి అభ్యర్థిగా మారారు. ఆ పార్టీ సభ్యత్వం తీసుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు.
* ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజాగా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణంరాజు. ఒక విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) కృతజ్ఞతలు తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన ఆరు నెలల కాలంలోనే ఆ పార్టీకి దూరమయ్యారు. 151 సీట్లతో అజేయమైన శక్తిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అన్ని ఎన్నికల్లోను గెలుపొందుతూ వచ్చారు. అటువంటి సమయంలోనే జగన్ పై తిరుగుబాటు చేశారు రఘురామకృష్ణంరాజు. రచ్చబండ పేరుతో మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ జగన్ బలంగా ఉన్న రోజుల్లోనే.. నెగిటివ్ పెంచిన ఘనత రఘురామకృష్ణం రాజుది. ఒక విధంగా చెప్పాలంటే విపక్షాలకు రఘురామకృష్ణం రాజు ద్వారా మాత్రమే వైసిపి పై వ్యతిరేకత పెంచే ఛాన్స్ వచ్చింది. అయితే రఘురామకృష్ణం రాజు పాపులర్ కావడానికి జగన్ పై ఉన్న కోపమే కారణం. అందుకే రఘురామకృష్ణం రాజును బహిష్కరించాలని చూశారు. వేటు వేయాలని భావించారు. ఆ ప్రయత్నాలన్నీ రఘురామకృష్ణం రాజును పాపులర్ అయ్యేలా చేశాయి. అయితే ఒక విషయంలో మాత్రం రామ్ గోపాల్ వర్మ రఘురామకృష్ణం రాజును హైలెట్ చేశారు. ట్రిపుల్ ఆర్ గా పేర్కొంటూ ఆర్జీవి చేసిన ట్వీట్ తోనే.. రఘురామకృష్ణంరాజు ట్రిపుల్ ఆర్ గా ముద్రపడ్డారు.
* ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా..
అయితే రఘురామకృష్ణం రాజు రాజకీయంగా అంత సంతృప్తికరంగా లేరట. తాను ఆశించిన స్థానం దక్కలేదట. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎంపీ పదవిని ఎంజాయ్ చేయలేకపోయారు. సొంత నియోజకవర్గానికి వెళ్లలేక పోయారు. చివరి వరకు బిజెపిని నమ్మి మోసపోయారు. టిడిపి ఆదరించి మరో నియోజకవర్గాన్ని కేటాయించింది. మంత్రి పదవి ఆశించారు. కానీ డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. అందుకే తాను ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా చెప్పుకుంటున్నారు రఘురామకృష్ణం రాజు. పనిలో పనిగా ఉచిత పథకాలకు ఓట్లు రావు అని ఉచిత సలహా ఇచ్చారు. తద్వారా సూపర్ సిక్స్ అంటున్న టిడిపి కూటమి ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేశారు. అయితే పొలిటికల్ గా ఏదేదో ఊహిస్తే.. తనకు సరైనది దక్కలేదన్న బాధ మాత్రం రఘురామకృష్ణంరాజులో కనిపిస్తోంది. చూడాలి మరి మున్ముందు ట్రిపుల్ ఆర్ ఎటువంటి సంచలనాలకు వేదిక అవుతారో???