Raghuramakrishnam Raju: ఏపీలో( Andhra Pradesh) రాజకీయ అస్థిరత కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు. ముఖ్యంగా కూటమిలో విచ్ఛిన్నం రావాలని తెగ ప్రయత్నం చేస్తోంది. అందుకు ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోవడం లేదు. ఇటీవల పవన్ కళ్యాణ్ భీమవరం డిఎస్పి పై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయనపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పవన్ కళ్యాణ్ డిజిపి తో పాటు హోం మంత్రిత్వ శాఖకు కీలక సూచనలు చేశారు. తన శాఖ కార్యాలయం నుంచి సమాచారం అందించాలని సూచించారు. అలాగే పశ్చిమగోదావరి ఎస్పీతో నేరుగా ఫోన్లో మాట్లాడి ఆరా తీశారు. దీంతో రెండు రోజులపాటు భీమవరం డిఎస్పి వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. భీమవరం డిఎస్పీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉందని.. ఆయనపై తప్పుడు ఫిర్యాదులు అన్నట్టు వ్యాఖ్యానించారు. అది మొదలు రఘురామకృష్ణం రాజును టార్గెట్ చేసుకొని.. జనసేన అభిమానులు.. మెగా ఫ్యాన్స్ పెరిట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.
* బాలకృష్ణపై అదే తరహాలో..
గతంలో కూడా ఇటువంటి పరిస్థితి ఉంది. శాసనసభలో నాటి సినీ పరిశ్రమకు ఎదురైన పరిస్థితులను బాలకృష్ణ( Nandamuri Balakrishna) ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి ఎవరిని గౌరవించలేదని.. అప్పట్లో సినీ పరిశ్రమ పెద్దల వినతి మేరకు జగన్ దిగివచ్చారు అనడంలో వాస్తవం లేదని తేల్చి చెప్పారు బాలకృష్ణ. ఆ వ్యాఖ్యలు వచ్చిన మరుక్షణం మెగాస్టార్ చిరంజీవికి వ్యతిరేకంగా బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బాలకృష్ణ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. మెగా అభిమానుల ముసుగులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు చేసిన హడావిడి అంతా కాదు. మొన్న సైతం కందుకూరులో జరిగిన ఒక హత్యను.. కమ్మ, కాపు మధ్య వైరంగా మార్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ అవసరం కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది. అందుకే ఆ పార్టీ వైపు అనుమానపు చూపులు ఉన్నాయి.
* పవన్ ప్రస్తావన తేకున్నా..
రఘురామకృష్ణం రాజు( deputy speaker Raghu Ramakrishnan Raju ) అంటేనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఒకలాంటి వ్యతిరేకత భావం. ఆయన వల్లే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభం అయిందని ఆ పార్టీ శ్రేణులకు తెలుసు. ఏదైనా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా చెబుతారు రఘురామకృష్ణంరాజు. ఈ క్రమంలోనే తనకు తెలిసిన సమాచారం మేరకు భీమవరం డిఎస్పీ గురించి వ్యాఖ్యానించారు. కనీసం ఎక్కడ పవన్ ప్రస్తావన తేలేదు. కానీ పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కేవలం కూటమిలో గందరగోళం సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా రఘురామకృష్ణంరాజు గుర్తించారు. అందుకే నేరుగా డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఏయే సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తనపై వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుందో వివరాలు సమర్పించారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి తాను ఎప్పుడూ తప్పుడుగా వ్యాఖ్యానాలు చేయలేదని.. దీని వెనుక వైయస్సార్ కాంగ్రెస్ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కూటమిలో గందరగోళానికి సృష్టించే ప్రయత్నం సక్సెస్ కాదన్న విషయాన్ని గుర్తించుకోవాలని హెచ్చరించారు. మొత్తానికి అయితే టిడిపి, జనసేన విడిపోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది వైసిపి. కానీ అది అంత ఈజీ కాదని తెలుస్తోంది.