https://oktelugu.com/

Purandheswari : సీఎం అభ్యర్థిగా పురంధేశ్వరి.. బీజేపీ భారీ స్కెచ్

జాతీయస్థాయిలో పదవి కట్టబెట్టి కర్చిఫ్ వేసి ఉంచారు. అదును చూసి మిగతా రాజకీయ పక్షాలను దెబ్బకొట్టే వ్యూహంలో బీజేపీ ఉంది. మరి ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.

Written By:
  • Dharma
  • , Updated On : July 7, 2023 8:54 am
    Follow us on

    Purandheswari : ఏపీ విషయంలో బీజేపీ హైకమాండ్ భారీ వ్యూహంతో ఉంది. ఒక జాతీయ పార్టీగా ఎవరి సొంత ఆలోచనలు వారికుంటాయి. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి..ఇప్పటివరకూ బీజేపీ వ్యూహాలేవీ ఫలించలేదు. దేశ వ్యాప్తంగా.. చివరకు తెలంగాణలో సైతం మంచి ప్రభావమే చూపుతూ వస్తోంది. కానీ ఏపీలో మాత్రం ప్రజల్లోకి వెళ్లలేకపోయింది. టీడీపీ ఆవిర్భావ సమయంలోనే జనసంఘ్ నుంచి బీజేపీగా రూపాంతరం చెందినా చెప్పుకోదగ్గ విజయాలను సొంతం చేసుకోలేకపోయింది. మధ్య మధ్యలో పొత్తులతో సీట్లు, ఓట్లు సాధించినా.. మిగతా సమయాల్లో మాత్రం ఉనికి చాటుకునేందుకు కూడా ఆపసోపాలు పడుతోంది.

    ప్రధాని మోదీ, షా ద్వయం ఏపీలో ఏంచేద్దామన్న దానిపై పెద్ద మేథోమధనం చేస్తూ వచ్చారు. అన్ని పార్టీలు బీజేపీ స్నేహాన్ని కోరుకుంటున్నాయి. కానీ ఏపీలో బీజేపీ అభివృద్ధిని కోరుకోవడం లేదు. అందుకే ఇరువురు పెద్దలు భారీ స్కెచ్ వేశారు. కమ్మ, కాపు, రెడ్లను సంఘటితం చేయాలని చూశారు. పురంధేశ్వరికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. పవన్ రూపంలో కాపు ఫ్యాక్టర్ ఉండేలా చూసుకున్నారు. అయితే ఇది 2024 ఎన్నికలకు టార్గెట్ చేసుకొని తీసుకున్న నిర్ణయం కాదని.. 2029 ఎన్నికల వ్యూహమంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తు కుదిరితే ఒక వ్యూహం.. పొత్తు లేకుంటే మరో వ్యూహంతో ముందుకెళ్లాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. పవన్ కానీ టీడీపీతో వెళ్లకుండా ఉంటే మాత్రం పవర్ షేరింగ్ విషయం ఆలోచించే అవకాశం ఉంది. బీజేపీ, జనసేన అలయెన్స్ అయితే తొలి రెండున్నరేళ్లు పురంధేశ్వరి.. మలి రెండున్నరేళ్లు పవన్ ను సీఎం అభ్యర్థులుగా ప్రకటించే అవకాశముంది. అయితే అది జాతీయ స్థాయిలో ఎన్డీఏ పరిస్థితిని అంచనా వేసుకొని నిర్ణయం తీసుకునే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎన్డీఏకు మిత్రులు అవసరం, మెజార్టీ మార్కు తక్కువ వస్తుందని సంకేతాలు వస్తే మాత్రం టీడీపీ, జనసేనతో పాటు కలిసి వెళ్లేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి.

    అయితే సీట్లు, ఓట్లు పక్కన పెట్టి.. ఏపీలో 2029 ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ భావిస్తే మాత్రం పొత్తులు పక్కనపెట్టే అవకాశాలున్నాయి. 2024లో ఒంటరిగా పోటీచేయాలన్న వ్యూహం సైతం అమలుచేసే అవకాశముంది. అందులో భాగంగానే పురంధేశ్వరికి నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. కమ్మ సామాజికవర్గాన్ని ఆకర్షించడం, బలమైన ఆర్థిక వర్గం సపోర్టు తీసుకోవాలన్నదే హైకమాండ్ పెద్దల అభిమతం. అదే సమయంలో వైసీపీ నిరాదరణకు గురైన రెడ్డి సామాజికవర్గం నేతలను సైతం తమ వైపు తిప్పుకోవాలని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీలోకి తెచ్చారు. జాతీయస్థాయిలో పదవి కట్టబెట్టి కర్చిఫ్ వేసి ఉంచారు. అదును చూసి మిగతా రాజకీయ పక్షాలను దెబ్బకొట్టే వ్యూహంలో బీజేపీ ఉంది. మరి ఎంతవరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.