Pulivendula By Election: కడపలో( Kadapa ) సీన్ మారింది. రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోయింది. మొన్నటి ఎన్నికల్లో అధికారం తారుమారు కావడంతో పొలిటికల్ సీన్ అమాంతం మారిపోయింది. నాయకులకు స్వేచ్ఛ వచ్చింది. 2021లో జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగాయి. కడప జిల్లాలో మొత్తం 52 స్థానాలు ఉంటే.. 49 ఏకగ్రీవం అయ్యాయి. అవి కూడా అప్పటి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. కనీసం పోటీ చేసేందుకు కూడా ప్రత్యర్థులు ముందుకు రాలేనంతగా పరిస్థితి మారింది. కానీ ఇప్పుడు పులివెందుల జడ్పిటిసి స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 11 మంది బరిలో ఉన్నారు. గతంలో ఏకగ్రీవమైన స్థానంలో ఇంతమంది పోటీ చేస్తున్నారంటే నిజంగా సీన్ మారినట్టే కదా. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ వచ్చినట్టే కదా. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో అందరి దృష్టి పులివెందులపై ఉంది. అక్కడ ఫలితం ఎలా ఉంటుందన్న చర్చ బలంగా నడుస్తోంది.
Also Read: తెలంగాణలో జానపద గీతాల వైభవం.. ఆంధ్రాలో ఎందుకు లేదు..
ఆందోళనలో వైసిపి.. పులివెందుల( pulivendula ) జడ్పిటిసి సభ్యుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. మొన్నటి ఎన్నికల్లో కూటమి ప్రభంజనం సృష్టించింది. తమ పట్టు కొనసాగుతోందని చెప్పడానికి ఇప్పుడు ఉప ఎన్నిక రూపంలో టిడిపి కూటమికి అవకాశం చిక్కింది. ఎట్టి పరిస్థితుల్లో అవకాశం వదలకూడదని భావిస్తోంది కూటమి. ఇప్పటివరకు ఉన్నది వైయస్ కుటుంబ హవా మాత్రమేనని.. రాజకీయం తారుమారు అయితే పరిస్థితి ఎలా ఉంటుందో చూపించాలని పట్టుదలతో ఉన్నారు కూటమి నేతలు. కానీ వైయస్సార్సీపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. పైకి మేకపోతు గాంభీర్యం ఉన్నా.. లోలోపల మాత్రం కూటమి పట్టు బిగిస్తోంది. అయితే పులివెందులపై అవగాహన ఉన్న నేతలు ఆందోళనతో ఉన్నారు. అయితే జగన్ మాత్రం ఇవేవీ పట్టించుకునే పరిస్థితిలో లేరు. కేవలం ఎంపీ అవినాష్ రెడ్డి, మరో నాయకుడు సతీష్ రెడ్డి పై మాత్రమే ఆధారపడుతున్నారు. దీంతో ప్రమాదం తప్పదు అన్న విశ్లేషణలు వస్తున్నాయి.
పట్టు బిగిస్తున్న టిడిపి..
ప్రస్తుతం పులివెందులలో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) బలం పెంచుకునే పనిలో పడింది. వైసీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకు పై ఫోకస్ పెట్టింది. ఇక్కడ టిడిపి నేతలు విస్తృతంగా శ్రమిస్తున్నారు. జమ్మలమడుగు బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అయితే తన పెద్దరికం చూపిస్తున్నారు. గ్రామాల్లో పలుకుబడి ఉన్న వారితో మాట్లాడి.. టిడిపి వైపు మొగ్గేలా చేస్తున్నారు. కానీ దానిని నియంత్రించే పరిస్థితిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లేదు. పులివెందులకు వైసీపీ తరఫున పెద్దదిక్కుగా ఉండేవారు ఎంపీ అవినాష్ రెడ్డి. కానీ ఇటీవల కాలంలో పులివెందుల వైసీపీ విషయంలో అవినాష్ రెడ్డి పెద్దగా మాట్లాడడం లేదు. టిడిపి నుంచి వైసీపీలో చేరిన సతీష్ రెడ్డి ఎక్కువగా మాట్లాడుతున్నారు. అయితే సతీష్ రెడ్డిని తమ వాడిగా చూసుకోవడం లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. దానికి కారణం లేకపోలేదు. రాజారెడ్డి హత్య కేసులో నిందితుడు సతీష్ రెడ్డి. ఆయన ఇప్పుడు జగన్ కోసం పరితపిస్తుండడం వైసిపి శ్రేణులకు నచ్చడం లేదు.
అన్ని ప్రతికూలతలే..
మరోవైపు జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy)తల్లి, సోదరి ఆయనను విభేదిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం అక్కడ బరిలో ఉంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ సైతం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. ఇది అవినాష్ రెడ్డికి ఇబ్బంది కలిగించే పరిణామం. ఆయన ఎక్కడకు వెళ్లిన వివేకానంద రెడ్డి హత్య గురించి చర్చ జరగడం ఖాయం. పులివెందుల నియోజకవర్గంతో వివేకానంద రెడ్డికి ప్రత్యేక అనుబంధం. అవినాష్ రెడ్డి వెళ్లడం ద్వారా చర్చకు దారి తీసినట్టు అవుతుంది. అదే జరిగితే వైసీపీకి నష్టం తప్పదు. అందుకే అవినాష్ రెడ్డి తెరవెనుక వ్యూహాలకు పరిమితమవుతున్నారు. సతీష్ రెడ్డి ముందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దగా ఆహ్వానించడం లేదు. మధ్యమార్గంగా చాలామంది పెద్దలు సైలెంట్ అవుతున్నారు. దీంతో చాలా గ్రామాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను తమ వైపు తిప్పుకుంటూ ఉంది టిడిపి. దీంతో జగన్ కు షాక్ తప్పేలా లేదు. ఒకప్పుడు పోటీకి ముందుకు రానివారు పులివెందులలో పెద్ద ఎత్తున నామినేషన్లు వేసినప్పుడే.. అక్కడ రాజకీయ సమీకరణలు మారిపోయాయి. మరి ఈ నెల 12న జరగనున్న ఎన్నికల్లో పులివెందుల ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.