Pulivendula: పులివెందులలో తేడా కొడుతోందా?

స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైసిపి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. ఎంపీటీసీలు, సర్పంచులను గెలుపొందింది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో 25 వార్డులకు గాను.. 20 చోట్ల గెలుపొంది చంద్రబాబుకు సవాల్ విసిరింది.

Written By: Dharma, Updated On : May 22, 2024 2:37 pm

Pulivendula

Follow us on

Pulivendula: ప్రత్యర్థులను బలహీనం చేయడంలో వైసిపి వ్యూహానికి అభినందించాల్సిందే. గత ఎన్నికల్లో అంతులేని విజయం, ఉప ఎన్నికల్లో గెలుపు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్ష విజయాలు.. ఇలా ఒకటేమిటి గత ఐదేళ్లుగా వైసిపికి అన్ని శుభసూచికాలే. ఆ నమ్మకంతోనే వై నాట్ 175 అన్న నినాదాన్ని ఆ పార్టీ అందుకుంది. అందులో భాగంగానే కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నారట. మంగళగిరిలో లోకేష్ కు అవకాశం లేదట. పిఠాపురంలో పవన్ కు అపజయం పలకరించనుందట. అంటూ ఎన్నికలకు ముందే ప్రచారం మొదలు పెట్టింది. అయితే పరిస్థితులు ఒకేలా ఉండవు. ఓటింగ్ శాతం పెరిగింది. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది.ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు విపక్షాలు.. వైసిపి పై ఎదురుదాడి ప్రారంభించాయి. పులివెందులలో జగన్ ఓడిపోతున్నారని ప్రచారం చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే బెట్టింగులు జరుగుతుండడంతో వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైసిపి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. ఎంపీటీసీలు, సర్పంచులను గెలుపొందింది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో 25 వార్డులకు గాను.. 20 చోట్ల గెలుపొంది చంద్రబాబుకు సవాల్ విసిరింది. గెలుపు గెలుపే కనుక చంద్రబాబు శిబిరం కూడా కలవరం చెందింది. అయితే ఇక్కడే ఒక లాజిక్ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి వైసిపి ప్రభుత్వం పటిష్ట స్థితిలో ఉంది. యంత్రాంగం మొత్తం పనిచేసింది. సర్వశక్తులు వడ్డింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. కూటమిపై సానుకూలత వ్యక్తం అయింది. ప్రభుత్వ వ్యతిరేక వర్గాలన్నీ ఏకమయ్యాయి. ఇటువంటి సమయంలో చంద్రబాబును కుప్పంలో ఓడించడం సాధ్యం కాదని తేలిపోయింది.

అదే సమయంలో పులివెందులలో కొత్త టాక్ ప్రారంభమైంది. షర్మిల రూపంలో ఒకవైపు, కూటమి రూపంలో మరోవైపు, బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య అంశం ఇంకోవైపు చుట్టుముట్టాయి. పులివెందులలో సైతం అప్రమత్తం కావాల్సిన పరిస్థితి జగన్ పై ఏర్పడింది. అందుకే జగన్ సతీమణి భారతి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. గడపగడపకు ప్రచారం చేయాల్సి వచ్చింది. అందుకే ఇప్పుడు కుప్పం పక్కకు వెళ్ళింది. పిఠాపురం పై భ్రమలు తొలగాయి. మంగళగిరిలో కష్టాలను లోకేష్ అధిగమించారు. అందుకే ఇప్పుడు అందరి దృష్టి పులివెందుల పై పడింది. జోరుగా బెట్టింగులు సాగుతుండడంతో ఏదో తేడా కొడుతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.