Sajjala Ramakrishna Reddy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి పై రోజురోజుకు అసహనం పెరుగుతోంది. జగన్మోహన్ రెడ్డితో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును కోరుకునే ప్రతి ఒక్కరు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. మొన్న ఆ మధ్యన నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చుట్టూ భజన పరులను నమ్ముకోకుండా.. నమ్మకమైన వ్యక్తులను, నిజమైన పార్టీ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. తద్వారా సజ్జల రామకృష్ణారెడ్డి పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో సైతం సజ్జల తీరుపై కథనాలు వస్తున్నాయి. ఆ పార్టీ అధికారిక వెబ్సైట్ లో అయితే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భక్షకుడు, కూటమి రక్షకుడు అంటూ పతాక శీర్షిక నా ఒక కథనం వచ్చింది. సజ్జల తీరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అవుతుందన్నది ఆ కథనం సారాంశం. దానిపై హితబోధ చేస్తూ జగన్మోహన్ రెడ్డికి విన్నవిస్తూ రాసిన ఈ కథనం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక రకమైన ఆందోళన నింపుతోంది.
* అనుమానపు చూపులు..
సజ్జల రామకృష్ణారెడ్డి పై( sajjala Ramakrishna Reddy ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అనుమానపు చూపులు ఉన్నాయి. ఎక్కడో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని తెచ్చి పార్టీ బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల హవా మరింత పెరిగింది. చివరకు జగన్మోహన్ రెడ్డి తరువాత సజ్జల అన్నట్టు పరిస్థితి మారింది. పార్టీ విధానాలతో పాటు ప్రభుత్వ విధానాలు సజ్జల ద్వారా అమలు చేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి వెనుకడుగు వేయలేదు. అప్పట్లోనే సజ్జల పాత్ర పై అనేక రకాల అనుమానాలు, ఆగ్రహాలు వైసిపి నేతల నుంచి వ్యక్తం అయ్యాయి. ఐదేళ్ల వైసిపి పాలనలో జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యేలకు మధ్య ఉన్నారు సజ్జల. దీంతో జగన్మోహన్ రెడ్డి పార్టీ విషయంలో తీసుకునే నిర్ణయాలు, మార్పులు వెనుక సజ్జల పాత్ర ఉందన్నది బహిరంగ రహస్యం. అందుకే మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయానికి సజ్జల కారణం అన్నది వైసిపి లోని మెజారిటీ శ్రేణుల అభిప్రాయం.
* పార్టీతో పాటు సాక్షి బాధ్యతలు వారికే..
2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందిన తర్వాత చాలామంది నేతలు సజ్జలపై జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన వైఖరితోనే ఈ పరిస్థితి ఎదురైందని చెప్పుకొచ్చారు. దీంతో జగన్మోహన్ రెడ్డి వైఖరిలో కొంత మార్పు వచ్చింది. పార్టీ వ్యవహారాలలో కొంత దూరం పెట్టారు. అయితే తరువాత అదే సజ్జలకు రాష్ట్ర సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మొత్తం పార్టీ సజ్జల కంట్రోల్లో ఉంది. సజ్జన వద్దనుకున్న వారు పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు. ఇప్పుడు సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి సాక్షి మీడియాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఒకవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, మరోవైపు సాక్షి మీడియా సజ్జల కుటుంబం చేతిలోకి వెళ్లిపోయింది. మరోవైపు కూటమి ప్రభుత్వం సజ్జల విషయంలో చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఆయన కుమారుడి అరెస్టు జరుగుతుందని అంతా భావించారు. కానీ కూటమి ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో సజ్జలపై వైసీపీలోనే అనుమానపు చూపులు పెరిగాయి.