PM Modi And Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) కేంద్ర పెద్దల వైఖరి పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రాధాన్యం కేంద్రంలో పెరిగింది. దానికి కారణం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉండి.. మోదీ మూడోసారి ప్రధాని అయ్యేందుకు అవసరమైన సంఖ్యా బలాన్ని అందించగలిగింది తెలుగుదేశం పార్టీ. అయితే గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు కేంద్ర పెద్దలతో చాలా సఖ్యతగా మెలుగుతూ వచ్చారు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఏ విషయంలోనూ గాబరా పడటం లేదు. కేంద్రంతో ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి లేదు. అయితే ఈ కేంద్ర పెద్దలతో నమ్మదగని మిత్రుడు అనిపించుకున్నారో.. అదే పెద్దలతో శభాష్ అంటూ చప్పట్లు కొట్టించుకుంటున్నారు. విశాఖ పెట్టుబడుల సదస్సులో అయితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఏపీ సీఎం మాట్లాడుతున్నంతసేపు తన చప్పట్లతో ప్రోత్సాహం అందిస్తూ వచ్చారు. అలాగని ఆయన ఏదో ఒక డమ్మీ కేంద్రమంత్రి కాదు. అక్షరాల ప్రధాని నరేంద్ర మోడీ కోర్ టీం లో ఉన్న నేత.
* నాడు కేంద్ర పెద్దలకు ప్రత్యర్థిగా..
2018లో ఎన్డీఏ( National democratic Alliance ) నుంచి దూరమయ్యారు చంద్రబాబు. అప్పటివరకు కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యమై పనిచేసిన ఆయన.. ఉన్నఫలంగా కేంద్ర ప్రభుత్వానికి దూరమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడ్డారు. ఆ సమయంలో కేంద్ర పెద్దలతో ఢీ కొట్టినంత పని చేశారు. అప్పుడే ఏపీలో చంద్రబాబు పని పట్టాలని కేంద్ర పెద్దలు నిర్ణయించుకున్నారు. కేంద్రానికి చెందిన ప్రత్యేక టీం ఏపీలో పనిచేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం వెనుక బిజెపి వ్యూహాలు ఉన్నట్లు అప్పట్లో టిడిపి అనుమానించింది. అయితే 2019 నుంచి 2024 మధ్య ప్రతి పరిణామాన్ని గుణపాఠంగా మార్చుకుంది టిడిపి. తన తప్పు తెలుసుకున్న చంద్రబాబు కేంద్ర పెద్దలతో సఖ్యత ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఇప్పటికీ కేంద్ర పెద్దలు చంద్రబాబును నమ్మడం లేదన్న ప్రచారానికి చెక్ చెబుతూ.. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ చంద్రబాబుకు అభినందనలతో ముంచెత్తడం విశేషం.
* కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రశంస
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో.. సిఐఐ ( CII) నేతృత్వంలో విశాఖలో పెట్టుబడుల సదస్సు జరిగింది. దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అయితే కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోంది అని ఈ పెట్టుబడుల సదస్సుతో తేలిపోయింది. గత కొద్ది రోజులుగా ప్రపంచ దిగ్గజ సంస్థలు ఏపీకి వస్తున్నాయి. భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఏర్పాటు అవుతున్నాయి. తద్వారా ఏపీకి తమ సాయం ఉంటుందని కేంద్రం స్పష్టమైన సంకేతాలు పంపుతోంది. 2014 నుంచి 2024 వరకు ఏపీ విషయంలో కేంద్రం నుంచి అసంపూర్ణ సహకారం అందేది. కానీ గడిచిన 17 నెలల కాలంలో కేంద్రం వైఖరి చూస్తుంటే ఏపీ పట్ల పూర్తి ఉదారస్వభావం చూపుతున్నట్లు అర్థమవుతోంది. స్వయంగా ప్రధానికి అత్యంత సన్నిహితుడు అయిన పీయూష్ గోయల్ ఏపీ సీఎం చంద్రబాబు పట్ల చూపుతున్న గౌరవం చూస్తుంటే మాత్రం.. బిజెపి పెద్దలకు అత్యంత ఇష్టుడైన నాయకుడిగా చంద్రబాబు అవతరించారని అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు.