Prime Minister Modi: ఏపీ( Andhra Pradesh) విషయంలో ప్రధాని మోదీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారా? మిత్రులకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారా? తద్వారా నాలుగో సారి ఈ దేశానికి ప్రధాని కావాలనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీ ద్వారా ఆ కలలు సహకారం చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి 25 పార్లమెంట్ స్థానాలు దక్కేలా గట్టి వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లకు రాజకీయ పదోన్నతి కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొన్నటి కర్నూలు పర్యటనతో ఇది స్పష్టంగా కనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* పవన్ కు దక్షిణాది బాధ్యతలు..
మరో 15 ఏళ్ల పాటు కూటమి నిర్విరామంగా కొనసాగాలని నేతలు భావిస్తున్నారు. అది జరగాలంటే రాజకీయ ప్రయోజనాలు ఇచ్చిపుచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( deputy CM Pawan Kalyan) ను దక్షిణాది బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ లో సామాజిక సేవా కోణం ఉంటుంది. హిందుత్వ వాదాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే దక్షిణాది లో బిజెపిని బలోపేతం చేసే బాధ్యతలను పవన్ కళ్యాణ్ కు అప్పగిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే సనాతన ధర్మ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ నడుంబిగించారు. హిందువుల్లో బలమైన ముద్ర చాటుకుంటూ వస్తున్నారు.
* కేంద్ర మంత్రిగా లోకేష్..
ఏపీ సీఎం గా చంద్రబాబు మరో ఐదేళ్లపాటు కొనసాగేందుకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆయన శారీరకంగా, ఆరోగ్యపరంగా దృఢంగా ఉన్నారు. రాజకీయంగా కూడా క్రియాశీలకంగా ఉన్నారు. అయితే చంద్రబాబు తర్వాత ఎవరు అంటే టిడిపి శ్రేణులు లోకేష్ పేరును, జనసేన శ్రేణులు పవన్ కళ్యాణ్ పేరును చెబుతుంటారు. అయితే మధ్య ఫార్ములాగా.. ప్రధాని మోదీ మరో ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. లోకేష్ సమర్థత, పనితీరు చూసి కేంద్రమంత్రిగా ఆయనను తీసుకుంటారని సమాచారం. గత 16 నెలలుగా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలోనూ, పారిశ్రామికవేత్తలను ఒప్పించడంలోనూ సక్సెస్ అయ్యారు. దానిని దగ్గర నుంచి చూసారు ప్రధాని మోదీ. అందుకే కేంద్ర క్యాబినెట్ లోకి లోకేష్ ను తీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చారు. ఒకవైపు ఏపీ సీఎం గా చంద్రబాబును కొనసాగిస్తూ.. ఇంకోవైపు దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను పవన్ కళ్యాణ్ కు అప్పగిస్తూ.. లోకేష్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా చేయాలని ప్రధాని భావిస్తున్నట్లు సమాచారం. మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియాలి.