Prime Minister Modi: రాష్ట్ర విభజన( state divide) జరిగి పదేళ్లు అవుతోంది. కానీ ఇంకా విభజన హామీల అమలు, సమస్యల పరిష్కారం మాత్రం ముందుకు కదల్లేదు. ప్రధానంగా విశాఖ రైల్వే జోన్( Visakha railway zone ) అంశం పెండింగ్ లో ఉండిపోయింది. దానిపై దృష్టి పెట్టింది కేంద్రం. ఈరోజు ప్రధాని మోదీ( Narendra Modi) విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కు శంకుస్థాపన చేయనున్నారు. అయితే జోన్ కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికకు( DPR ) ఇంకా ఆమోదం లభించకపోవడం పై మాత్రం ఆందోళన వ్యక్తం అవుతోంది. విభజన హామీల్లో భాగంగా విశాఖ కేంద్రంగా జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు 2019 ఫిబ్రవరిలో కేంద్రం ప్రకటించింది. జోన్ ఏర్పాట్లు అత్యంత కీలకమైన డిపిఆర్ ను అదే ఏడాది రూపొందించారు. జోన్ స్వరూపం, వివరాలు డిపిఆర్ ద్వారానే తెలుస్తాయి. అంతటి కీలకమైన డిపిఆర్ ను రైల్వే బోర్డుకు గతంలోనే నివేదించినా ఇప్పటికీ ఆమోదించకపోవడం గమనార్హం. ఈరోజు రైల్వే జోన్ కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనుండగా.. జోన్లో వాల్తేరు డివిజన్ ఉంటుందా? ఉండదా? అన్నది మాత్రం తెలియడం లేదు. ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. అయితే వాల్తేరు డివిజన్ ను కూడా చేరుస్తూ రూపొందించిన డిపిఆర్ రైల్వే బోర్డు వద్ద ఉన్నట్టు సమాచారం. అయితే పాత డిపిఆర్ ను పరిగణలోకి తీసుకుంటారా? కొత్త డి పి ఆర్ ను ఆమోదిస్తారా అన్నది ఇంతవరకు స్పష్టత లేదు.
* సుదీర్ఘ చరిత్ర
వాస్తవానికి వాల్తేరు రైల్వే డివిజన్ కు( Walter Railway Division) వందేళ్ల చరిత్ర ఉంది. రైల్వే బోర్డు కు గతంలో సమర్పించిన డిపిఆర్ లో ఈ డివిజన్ ను విజయవాడ డివిజన్లో కలిపారు. సంబంధిత రూట్లతో లైన్ క్లియర్ కూడా చేశారు. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఇచ్చినా వాల్తేర్ డివిజన్ ను మాత్రం యధాతధంగా కొనసాగించాలని ఉత్తరాంధ్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే( East Coast Railway) పరిధిలో.. వాల్తేరు డివిజన్లో రాయగడ ఉండేది. కానీ రాయగడ కేంద్రం గా కొత్త డివిజన్ కు సంబంధించి లైన్లు ఖరారు చేశారు. దీంతో వాల్తేరులో ఆదాయం వచ్చే పరిధి చాలా వరకు రాయగడ డివిజన్ పరిధిలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీంతో విశాఖ ప్రత్యేక జోన్ విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. మరోవైపు ప్రధాని మోదీ జోన్ కు శంకుస్థాపన చేస్తున్నారు.
* 52 ఎకరాలు సిద్ధం
మరోవైపు విశాఖ రైల్వే జోన్ కార్యాలయానికి సంబంధించి 52 ఎకరాలు సిద్ధంగా ఉన్నాయి. విశాఖ నగరంలోని( Visakha City ) చినగదిలి పరిధి ముడసర్లోవ వద్ద గతంలో రైల్వేకు భూములను కేటాయించారు. రైల్వే జోన్ అంశం కదలిక రావడంతో.. ఈ 52 ఎకరాల భూమికి సంబంధించి వాస్తవ స్థితిని పరిశీలించారు అధికారులు. వీటికి హద్దులు కూడా నిర్ణయించారు. ఇందులో ఎటువంటి ఆక్రమణలు లేవని గుర్తించారు. వీటిని త్వరలో రైల్వేకు పంపించి బదిలీ ప్రక్రియ పూర్తి చేయడానికి కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ భూములను తీసుకునేందుకు రైల్వే శాఖ సుముఖంగా ఉంది. కానీ వివాదాలు పరిష్కరించి అప్పగించాలని రైల్వే శాఖ కోరుతోంది.
* గత అనుభవాల దృష్ట్యా
గతంలో రైల్వే శాఖకు అప్పగించిన స్థలంలో ఆక్రమణలు జరిగాయి. కొంతమంది ఆ స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మాణాలు కూడా జరిపారు. అయితే అధికారులు స్పందించి వారందరితో ఖాళీ చేయించారు. ఆ క్రమంలో రైల్వే అధికారులపై ఆక్రమణదారులు కోర్టుకు వెళ్లారు. అందుకే ఇప్పుడు రైల్వే అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో హక్కులు కల్పించడంతోపాటు ప్రహరీ నిర్మించి స్థలాన్ని అప్పగించాలని రైల్వే అధికారులు కోరుతున్నారు. ఇక్కడ రైల్వే జోన్( railway zone ) కార్యాలయానికి సంబంధించి అనుకూలంగా ఉంది. అందుకే వీలైనంత త్వరగా పూర్తిస్థాయి హక్కులతో వాటిని అప్పగించాలని రైల్వే కోరుతోంది. ఒకవైపు వాల్తేర్ రైల్వే డివిజన్( Walter Railway Division ) అంశం, ఇంకోవైపు కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి స్థలాలపై అభ్యంతరం కొనసాగుతోంది. కానీ ఈరోజు ప్రధాని మోదీ( Narendra Modi) రైల్వే జోన్ కు శంకుస్థాపన చేస్తున్నారు. దీంతో వివాదాలతో పాటు సమస్యలకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుందని భావిస్తున్నారు.