https://oktelugu.com/

Prime Minister Modi: విశాఖకు మోదీ.. ఏకంగా రూ.85 వేల కోట్ల పనులకు!

విశాఖ నగరానికి ప్రధాని మోదీ రానున్నారు. కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లలో విశాఖ యంత్రాంగం తల మునకలై ఉంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 25, 2024 / 10:19 AM IST

    Prime Minister Modi

    Follow us on

    Prime Minister Modi: ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారు అయ్యింది. విశాఖలో 85 వేల కోట్ల పెట్టుబడితో ఎన్టిపిసి నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుతో పాటు పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. ప్రధానితోపాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ గవర్నర్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దీంతో విశాఖ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈనెల 29న విశాఖకు ప్రధాని మోదీ రానున్నారు. అక్కడ జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడనున్నారు ప్రధాని మోదీ. అక్కడ వేదిక నుంచే అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఎన్టిపిసి నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్, మరికొన్ని ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అదే సమయంలో రైల్వే జోన్ కు సైతం శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం.

    * గ్రోత్ హబ్ గా ప్రకటన
    విశాఖ నగరాన్ని గ్రోత్ హబ్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే పలు అభివృద్ధి పనులతో పాటు కీలకమైన ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తోంది. విభజన హామీల్లో ప్రధానమైన రైల్వే జోన్ సైతం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. మొత్తం 85 వేల కోట్ల పెట్టుబడితో నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుతో 25 వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది.ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే శరవేగంగా నిర్మించాలన్న కృతనిశ్చయంతో ఉంది.

    * పక్కాగా ఏర్పాట్లు
    ఇంకోవైపు ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖ అధికార యంత్రాంగం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు వివిధ విభాగాల ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో జరిగే బహిరంగ సభ, అంతకు ముందు జరిగే రోడ్ షో నిర్వహణపై భద్రతాపరమైన అంశాలపై చర్చించారు. ప్రధాని సాయంత్రం నాలుగు గంటల 40 నిమిషాలకు విశాఖ చేరుకుంటారు. సాయంత్రం ఐదు గంటల 25 నిమిషాల నుంచి 43 నిమిషాల వరకు ప్రసంగిస్తారు. వర్చువల్ విధానంలో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం ఐదు గంటల 45 నిమిషాలకు సభ నుంచి ఎయిర్పోర్ట్ కు తిరుగు పయనమవుతారు.