PM Modi: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో పట్టు కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. పెద్ద ఎత్తున నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నా.. జగన్మోహన్ రెడ్డి మాత్రం ధైర్యం పోగుచేసుకుని ప్రజల మధ్యకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం సైతం పట్టు బిగిస్తోంది. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా అమరావతి రాజధాని నిర్మాణం పూర్తిచేయాలని చూస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిపై దృష్టి పెట్టింది. జంగిల్ క్లియరెన్స్ పనులను చేపట్టి అమరావతిని యథాస్థానానికి తీసుకొచ్చింది. ఇప్పుడు పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సిద్ధపడుతోంది.
* కేంద్రం సాయం
గతంలో ఎన్నడూ లేని విధంగా అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సాయం ప్రకటించింది. 15000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది. ప్రపంచ బ్యాంకుతోపాటు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి నిధులను సర్దుబాటు చేసింది. అమరావతిలో పరిస్థితులను పరిశీలించిన ఆ రెండు బ్యాంకులు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఇతర మార్గాల్లో సైతం రాష్ట్ర ప్రభుత్వం నిధులను సమీకరించింది. దాదాపు 60 వేల కోట్ల రూపాయల వరకు అమరావతి రాజధాని నిర్మాణానికి అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. ఒకవైపు ప్రభుత్వ భవనాలతో పాటు ఇంకోవైపు వివిధ సంస్థలకు కేటాయించిన భూముల్లో నిర్మాణాలను జరపాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. అందుకు సంబంధించి దాదాపు సన్నాహాలను పూర్తి చేసింది.
* వచ్చే నెలలో పనులు
ఇంకోవైపు ఏప్రిల్ లో( April) అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను వేడుకగా ప్రారంభించాలని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ ని ఆహ్వానించనుంది. ఈ నెల చివర్లో ఢిల్లీ వెళ్ళనున్నారు చంద్రబాబు. ప్రధానితో భేటీ జరిగిన సమయంలో అమరావతి ఆహ్వానించునున్నారు. అమరావతి పనుల ప్రారంభ ఘట్టం అట్టహాసంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా నగరాల నిర్మాణంలో భాగంగా ప్రధానితో ఆ సిటీలకు శంకుస్థాపన చేయించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ మూడో వారంలో ప్రధాని అమరావతికి వచ్చే అవకాశం ఉంది. ప్రధాని ప్రారంభించిన నిర్మాణాలకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు చేసింది.
* ఐకానిక్ టవర్స్ పై ఫోకస్..
అమరావతి రాజధాని నిర్మాణంలో అత్యంత ప్రధానమైనవి ఐకానిక్ టవర్లు( iconic Towers ). వాటికి వచ్చేవారం టెండర్లు పిలవాలని భావిస్తున్నారు. ఐదు టవర్ల నిర్మాణానికి ప్రస్తుత ధరల మేరకు.. రూ. 4,687 కోట్ల విజయానికి ప్రభుత్వం పాలన ఆమోదం ఇచ్చింది. గతం మాదిరిగా ఈసారి కూడా 3 ప్యాకేజీలుగా టెండర్లు పిలవనున్నారు. జేఏడీ టవర్ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులు కాగా.. మిగిలిన నాలుగు హెచ్ఓడి టవర్లు 39 అంతస్తులుగా డిజైన్ చేశారు. ఈ టవర్ల నిర్మాణానికి 60000 వేల టన్నుల స్టీల్ అవసరం అవుతుంది.
* 2028 నాటికి పూర్తి..
ఎట్టి పరిస్థితుల్లో 2028 నాటికి అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ పనులు చేయాలని భావిస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే రాయగడ ఉక్కు పరిశ్రమతో పాటు బళ్లారిలోని జిందాల్ కర్మాగారం, తిరుచిరాపల్లిలోని ఎవర్ సెందై వర్క్ షాపులను పరిశీలించారు. రాయగడలో ఉక్కుకొని బళ్లారి, తిరుచిరాపల్లిలో ఫ్యాబ్రికేట్ చేయనున్నారు. త్వరలో మద్రాస్ ఐఐటీ నిప్పునులు వచ్చి పునాదుల పట్టిష్టతను పరిశీలించనున్నారు. అమరావతిలో మొత్తంగా రూ.64,721 కోట్ల ఖర్చుతో ప్రారంభిస్తున్న నిర్మాణ పనులను 2028 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.