Praveen Pagadala (1)
Praveen Pagadala: ఏపీలో పాస్టర్ ప్రవీణ్ పగడాల ( pastor Pravin pagadala ) మృతి కేసు పెను సంచలనానికి దారి తీసిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారని పోలీసులు చెబుతుండగా.. హత్య చేసి చంపేశారు అంటూ ఆయన అభిమానులు, అనుచరులు చెబుతున్నారు. దీనిపై గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తూ ఉంది. ఈ తరుణంలో ప్రవీణ్ పగడాల ఓ వైన్ షాప్ లో మద్యం కొంటున్నారంటూ ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రి కి బైక్ మీద వస్తున్న ఆయనను ఎవరో దారుణంగా హత్య చేశారని.. ఆయన ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయంటూ గత ఐదు రోజులుగా రాష్ట్రంలో పెద్ద ఉద్యమమే నడిచింది. పాస్టర్ సంఘాలు, క్రైస్తవ సంఘాలు ఆందోళన చేయడంతో ఏపీ ప్రభుత్వం సైతం విచారణకు ఆదేశించింది. అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
* మద్యం షాపు వద్ద వీడియో
ఆయన మృతికి ముందు సోమవారం రాత్రి ( Monday night)ఓ మద్యం షాపులో మద్యం కొనుగోలు చేశారంటూ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మద్యం మత్తులోనే వాహనం నడపడంతో రోడ్డు ప్రమాదానికి గురై ప్రవీణ్ పగడాల చనిపోయి ఉంటారని కొత్త ట్విస్ట్ తెరమీదకు వచ్చింది. వైన్ షాపులో ఆయన మద్యం కొన్నారా? సేవించరా? మద్యం సేవించి బైక్ నడిపారా అనేదానిపై స్పష్టత రాలేదు. ఈ వైరల్ వీడియో పై ఇంతవరకు పోలీసులు కూడా స్పందించలేదు.
* బుల్లెట్ పై బయలుదేరిన ప్రవీణ్
ప్రవీణ్ పగడాల హైదరాబాద్( Hyderabad) నుంచి మార్చి 24న బుల్లెట్ పై బయలుదేరారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు హైవేపై గాయాలతో ఆయన మృతదేహం కనిపించింది. అయితే ఆయన మృతి వివాదాస్పదంగా మారడంతో పోలీసులు స్పందించారు. హైదరాబాదు నుంచి బయలుదేరిన ప్రతి అంశాన్ని పరిశీలన చేశారు. 24వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 11:42 గంటల మధ్య ఆయన ఎవరెవరిని కలిసారనే దానిపై పోలీసులు నిషిత పరిశీలన చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సమగ్ర విచారణకు ఆదేశించాలని డిజిపి కి సూచించారు. హోం మంత్రి వంగలపూడి అనిత సైతం పోలీసులను విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేయాలని ఆదేశించారు.
* సరిగ్గా దర్యాప్తు సమయంలోనే..
ఒకవైపు పోలీస్ దర్యాప్తు( police enquiry) కొనసాగుతుండగా మద్యం షాపులో వీడియో ఒకటి బయటకు రావడం విశేషం. ఘటన జరిగిన సమయంలో అటువైపు నుంచి వెళుతున్న వాహనాల వివరాలను కూడా పోలీసులు సహకరిస్తున్నారు. చివరి మూడు నాలుగు గంటలు ప్రవీణ్ ఏం చేశారు? ఎవరిని కలిశారు? ఏమైనా గొడవ జరిగిందా అనే కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. పాస్టర్ ప్రవీణ్ హత్యకు గురయ్యారని క్రిస్టియన్ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అవసరం అనుకుంటే సిబిఐతో దర్యాప్తు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.