Pawan Kalyan become CM in AP: ఏపీలో మళ్లీ పవర్ షేరింగ్ పై కొత్త ప్రచారం ప్రారంభం అయింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్న ఆకాంక్షను బయట పెడుతున్నారు కొందరు. కర్ణాటకలో పవర్ షేరింగ్ నేపథ్యంలో ఇక్కడ కూడా జరగాలన్న విన్నపాన్ని జనసైనికులు సోషల్ మీడియా వేదికగా చేస్తూ వస్తున్నారు. అయితే దీని వెనుక వైసీపీ హస్తం ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల పవన్ కళ్యాణ్ కులంతో పాటు తన సీఎం పదవి కోసం నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కాపులకు ఎటువంటి ప్రాధాన్యత లేకుండా పోతుందని… పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే కాపుల ఆకాంక్ష తీరుతుందని కొందరు ప్రచారం చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్. మరి అటువంటిది తనను 2019లో ఎందుకు ఓడించారు అంటూ ప్రశ్నించారు. కచ్చితంగా ఇప్పుడు పొత్తు ఇచ్చిన కావాలి. ఆ ప్రయత్నంలో భాగంగా జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారంలో జనసైనికులు పాల్గొనవద్దని పవన్ స్పష్టమైన పిలుపు ఇచ్చారు. ఇప్పుడు అదే సమయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై రకరకాల చర్చ నడుస్తోంది.
అప్పట్లో పవర్ షేరింగ్ ఒప్పందంతో..
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. 2023లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే అనుభవజ్ఞుడైన సిద్ధరామయ్య వైపు అప్పట్లో కాంగ్రెస్ హై కమాండ్ మొగ్గు చూపింది. అయితే తన దూకుడుతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు డీకే శివకుమార్. కానీ అప్పుడు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా సిద్ధరామయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎం చేశారు. అప్పట్లోనే 2.5 ఫార్ములాతో ముఖ్యమంత్రి పదవి షేర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆ లెక్కన రెండున్నర సంవత్సరాలకు సిద్ధరామయ్య రాజీనామా చేయాలి. కానీ ఆయన ఆరు నెలలు అధికంగా పాలించారు. అయితే ఇప్పుడు సిద్ధరామయ్య రాష్ట్ర రాజకీయాలకు దూరం కావాలని నిర్ణయించుకున్నారు. రాజ్యసభ ద్వారా కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తున్నారు. డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతున్నారు. అయితే కర్ణాటక మాదిరిగా ఇప్పుడు ఏపీలో కూడా పవర్ షేరింగ్ కావాలి అనేది సోషల్ మీడియా వేదికగా వస్తున్న డిమాండ్.
పదే పదే ప్రచారం..
ఏపీలో కూటమిలో ముఖ్యమంత్రి పదవి షేరింగ్ అనేది ఇప్పటి మాట కాదు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ మాట వినిపిస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయకత్వాన్ని సమర్థిస్తూ.. ఆయన నేతృత్వంలోనే నడుస్తామని ప్రకటిస్తూ వచ్చారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 15 సంవత్సరాల పాటు కూటమి నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని తేల్చి చెప్పారు. తమ ప్రయత్నం రాజకీయం కోసం కాదని.. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అని పలుమార్లు తేల్చి చెప్పారు పవన్ కళ్యాణ్. ముఖ్యమంత్రి అనే మాట వినబడిన ప్రతి సారి ఆయన పార్టీ శ్రేణులకు సర్దుబాటు చేశారు. లేనిపోని ప్రకటనలు వద్దు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. తన మాటలను, తన ఆదేశాలను పాటించని వారు పార్టీకి అవసరం లేదని కూడా తేల్చి చెప్పారు. టిడిపి తో పొత్తు ప్రకటించిన మరుక్షణం నుంచి తనకు సలహాలు ఇచ్చేవారు ఎక్కువయ్యారని చెప్పుకొచ్చారు. పొత్తును అడ్డుకోవాలని చూశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అస్థిర పరచాలని చూస్తున్నారు. ఈ విషయంపై బాహటంగానే పార్టీ శ్రేణులకు హెచ్చరించారు పవన్ కళ్యాణ్. పవర్ షేరింగ్ అనే మాట ఏపీలో వినిపించే అవకాశం లేదు. ముఖ్యమంత్రి పదవికి పవన్ నుంచి పోటీ వచ్చే ప్రసక్తి లేదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియా లో జనసైనికుల పేరుతో వస్తున్న ఈ డిమాండ్ వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హస్తం ఉందన్నది కూటమి పార్టీ నేతల అనుమానం.
