Ponnovolu sudhakarreddy : పొన్నవోలు నయా లాజిక్.. నెయ్యిలో ఖరీదైన పంది కొవ్వు కలుపుతారా?

ఏపీలో లడ్డు వివాదంలో కొత్త కొత్త వ్యక్తులు తెరపైకి వస్తున్నారు. తమ వాదనలు వినిపిస్తున్నారు. తాజాగా తెలివైన లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వాదనలు వినిపించారు. సరికొత్త లాజిక్ పాయింట్లతో కొట్టారు.

Written By: Dharma, Updated On : September 28, 2024 10:05 pm

Ponnavolu Sudhakar Reddy

Follow us on

పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. చంద్రబాబు కేసుల్లో ప్రధానంగా వినిపించిన పేరు. అప్పట్లో ప్రభుత్వ న్యాయవాదిగా సేవలు అందించారు. దేశంలో పేరు మోసిన లాయర్లను గడగడలాడించారు.తనకు తాను పెద్ద లాయర్ నని భావించారు. తన ముందు సుప్రీంకోర్టు లాయర్లు సైతం దిగదుడుపు అని వాదనలు వినిపించారు. కనీసం ఆధారాలు లేని కేసుల్లో చంద్రబాబుకు చుక్కలు చూపించారు. దాదాపు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చోబెట్టారు. అటు తర్వాత చంద్రబాబుకు బెయిల్ రావడం, ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం చకచకా జరిగిపోయాయి. మధ్యలో ఎన్నికల ప్రచారం నిమిత్తం విదేశాలకు వెళ్లారు పొన్నవోలు. ఓ సమావేశంలో అయితే ఏకంగా ఏడ్చేశారు. ప్రజల గురించి అన్ని చేసిన జగన్ ఓడిపోకూడదని భావించారు. కానీ అందరూ ఏకమై జగన్ ను ఓడిస్తున్నారని బాధపడి పోయారు. ఆయన భావిస్తున్నట్టే జగన్ ఓడిపోయారు. పొన్నవోలు ప్రభుత్వ వకీలు పోస్టు ఊడిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా లడ్డు వివాదం నేపథ్యంలో తెరపైకి వచ్చారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. తనకున్న లాయర్ తెలివితేటలు చూపించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవే వైరల్ అవుతున్నాయి. మళ్లీ డిప్యూటీ సీఎం పవన్ సైతం పొన్నవోలు వ్యాఖ్యలను గుర్తు చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

* రేటు చెప్పి మరి వాదన
తాజాగా ఈ వివాదం పై మాట్లాడిన పొన్నవోలు ఒక లాజిక్ చెప్పారు. పంది కొవ్వు 1200 రూపాయలు ఉంది. నెయ్యి కేవలం 400 ఉంది. అటువంటిప్పుడు ఖరీదైన పంది కొవ్వును నెయ్యిలో కల్తీ చేస్తారా? అని ప్రశ్నించారు. అసలు పంది కొవ్వు ఎక్కడ తీస్తారు? ఎక్కడ వాడతారు? దానికో రేటు ఎక్కడి నుంచి ఫిక్స్ చేస్తారు? అన్నది పొన్నవోలుకే తెలియాలి. అసలు ఆధారాలు లేని కేసుల్లో చంద్రబాబును ఇరికించిన నేర్పరి ఆయన. ఈ కేసులో కూడా తన వాదనలు వినిపిస్తారు అన్నది చూడాలి. అయితే ఇంకాస్త ముందుకు వెళ్లిన ఆయన రాగిలో బంగారం కల్తీ చేస్తారా? ఇత్తడిలో బంగారం కలుపుతారా? అంటూ రెచ్చిపోయారు. అంటే నెయ్యి బదులు పంది కొవ్వు వాడడం అంటే.. రాగిలో బంగారం కలిపినట్లే అనుకోవాలి అన్నట్టు ఉంది ఆయన వాదన.

* కల్తీ కానీ.. పంది కొవ్వు కాదట
అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంతటితో ఆగలేదు. తన లాయర్ తెలివితేటలను మరింత బయట పెట్టారు. రిపోర్టులో ఎస్ వాల్యూ తక్కువగా ఉందంటే.. కల్తీ జరిగిందని అర్థమని.. కానీ అది పంది కొవ్వు కాదని చెబుతున్నారు. కల్తీ జరిగిందని ఒప్పుకుంటాను కానీ.. పంది కొవ్వు కాదన్నది ఆయన వాదన. అయితే ఏకంగా ఆయన ప్రెస్మీట్లో ఈ వాదన వినిపించడంతో జర్నలిస్టులు సైతం ఆశ్చర్యపోయారు. అనవసరంగా పొన్నవోలు ఈ ఇష్యూలోకి వస్తున్నారని వైసీపీలో సైతం కామెంట్స్ వినిపిస్తున్నాయి.