Ponnavolu Sudhakar Reddy: తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎదుర్కొంటున్న పరిస్థితినే ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష వైసీపీ ఎదుర్కొంటోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. 151 సీట్ల నుంచి కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. 5 ఎంపీ సీట్లు మాత్రమే గెలిచింది. దీంతో ఇప్పుడు పార్టీని కాపాడుకోవడం జగన్‌కు పెద్ద సవాల్‌గా మారింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలు పార్టీని వీడారు. త్వరలో 11 మంది ఎమ్మెల్యేల్లో ఎంత మంది ఉంటారో, ఎంతమంది పోతారో తెలియని పరిస్థితి. ఇక కొందరు టీపీపీ వేధింపులకు భయపడి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన పార్టీ పదవులను భర్తీ చేస్తూ.. పార్టీ బలంగా ఉందని క్యాడర్‌కు సంకేతం ఇస్తున్నారు అధినేత జగన్. తాజాగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిలో కీలక వ్యక్తిని నియమించారు. ఇప్పుడు ఇదే ఆంధ్రాలో హాట్ టాపిక్ అయింది.
పార్టీ నేతల కోసమే..
జల్సా సినిమాలో తన కుమార్తె ఇలియానాకు సెక్యూరిటీ ఆఫీసర్‌గా బ్రహ్మానందాన్ని పెడతాడు ఐపీఎస్ ఆఫీసర్ అయిన ప్రకాశ్‌రాజ్. ఎందుకంటే ఆ ఐపీఎస్‌కు.. ఆ బ్రహ్మానందమే ఎన్‌ఎస్జీ రేంజ్‌లో కనిపించారు. అంటే చూసే కళ్లను బట్టే ఉంటుందన్నమాట. వైసీపీ అధినేత జగన్ కూడా అంతే. ఆయన తమ పార్టీ నేతల తరఫున కేసులను కోర్టు కేసుల్లో వాదించడానికి పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు. పనిలో పనిగా ఆయనను ఇప్పుడు వైసీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా సజ్జల రామకృష్ణారెడ్డితో సమానం. పొన్నవోలు తాను.. తాన కుటుంబం అంతా ఫ్యాక్షనిస్టులమేనని ఆస్ట్రేలియాలో సిగ్గుపడుతూ సొంత పార్టీ నేతల ముందు గొప్పలు పోయారు. అది కూడా పదవి రావడానికి కలిసి వచ్చిందేమో అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఏఏజీగా పనిచేసి.. వైసీపీ లీడర్‌గా..
వైసీపీలో ఓ రేంజ్ లో ఉండాల్సిన అర్హత ఆయనకు ఉందని జగన్ తేల్చేసి పదవి ఇచ్చేశారు. నిన్నటిదాకా ఏఏజీగా పని చేసిన ఆయన ఇప్పుడు వైసీపీ లీడర్ గా మారిపోయారు. పదవిలో ఉన్నా ఆయన వైసీపీనేతగానే వ్యవహరించారు.. నల్లకోటు పరువు తీశారని చాలా మంది విమర్శిచినా ఆయన తుడిచేసుకున్నారు.. అది వేరే విషయం అయితే పొన్నవోలు ఇప్పుడు ఉత్తినే ఆ పదవి ఇవ్వలేదు. అరెస్టయ్యే ప్రతి నాయకుడ్ని విడిపించాలి. కానీ ఆయన వాదిస్తే విడిపించే సంగతేమో కానీ వచ్చే బెయిల్ కూడా రాకుండా చేస్తారేమోనన్న భయం పార్టీ నేతలకు ఉంటుంది. అయినా జగన్ రెడ్డి పెడుతున్నారు కాబట్టి పొన్నవోలుసాయం తీసుకోవాల్సిందే. అసలే కేసులతో తంటాలు పడే వైసీపీ నేతలకు గుదిబండగా పొన్నవోలును జగన్ తగలించేస్తున్నారని వేదనకు గురవుతున్నారు.