AP Elections Survey: ఏపీలో ఎమోషనల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రాళ్ల దాడి పర్వం కొనసాగుతోంది. అటు అధికార, ఇటు విపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. పై చేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో పదునైన అస్త్రాలతో విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ తరుణంలో గెలుపు మాదంటే మాది అని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు సర్వే సంస్థలు హల్చల్ చేస్తున్నాయి. ప్రజాభిప్రాయం ఇది అంటూ ఫలితాలను ప్రకటిస్తున్నాయి. తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ అనే సంస్థ సర్వే ఫలితాలను వెల్లడించింది. ఏపీలో అధికారంలోకి వచ్చేది ఎవరో తేల్చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సర్వే చేపట్టినట్లు సదరు సంస్థ ప్రకటించింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 10 మధ్య ఈ సర్వే నిర్వహించినట్లు స్పష్టం చేసింది.1,48,532 మంది ఓటర్ల అభిప్రాయాన్ని సేకరించినట్లు వివరించింది. మరోసారి వైసిపి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చి చెప్పింది. 120 నుంచి 130 అసెంబ్లీ సీట్లు వైసిపి గెలుచుకొని అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేసింది. 19 నుంచి 21 లోక్సభ స్థానాలను వైసిపి గెలుచుకోబోతోందని సర్వే స్పష్టం చేయడం విశేషం.
ఎలాగైనా వైసీపీని గద్దె దించాలని కూటమి కట్టిన టిడిపి, జనసేన, బిజెపిలకు పరాభవం తప్పదని ఈ సర్వే తేల్చింది. కూటమి 45 నుంచి 55 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పరిమితం కానుందని తేల్చి చెప్పింది. అటు లోక్సభ స్థానాలు సైతం కూటమికి ఐదు నుంచి 6 స్థానాలు లభించవచ్చని స్పష్టం చేసింది. వైసీపీకి 50 నుంచి 52 శాతం ఓట్లు పోల్ అవుతాయని.. 48 శాతం మంది పురుషులు, 55 శాతం మంది మహిళలు జగన్ కు జై కొట్టినట్లు వివరించింది. అటు టిడిపి కూటమి 46% వరకు ఓట్లు పొందే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది.ప్రస్తుతం సీఎం జగన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అంతకంటే ముందే ఈ సర్వే జరిగిందని.. గత రెండు రోజులుగా విపరీతమైన సానుభూతి వ్యక్తం అవుతుందని.. సంపూర్ణ విజయం దిశగా వైసిపి దూసుకెళ్లడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.