AP Survey: ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని సర్వే సంస్థలు ఫలితాలను వెల్లడిస్తున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా ఆసక్తికర సర్వేలు బయటకు వచ్చాయి. ఏబీపీ సి ఓటర్ సంస్థతో పాటు న్యూస్ 18 సంస్థ తమ సర్వే వివరాలను వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభంజనం సృష్టిస్తుందని.. ఆ ప్రభావం ఏపీలోనూ ఉండబోతుందని తేల్చి చెప్పాయి.
ఫిబ్రవరి 1 నుంచి మార్చి 10 వరకు ఏబిపి సి ఓటర్ సర్వే నిర్వహించినట్లు సంబంధిత సంస్థ ప్రకటించింది. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు గాను టిడిపి, జనసేన, బీజేపీ కూటమి 20 సీట్లు గెలుచుకోనున్నట్లు తేల్చి చెప్పింది. వైసిపి కేవలం ఐదు స్థానాలకే పరిమితం కానుందని తేల్చేసింది. కూటమికి 44.7% ఓట్లు, వైసీపీకి 41.9% ఓట్లు లభించనున్నట్లు ప్రకటించింది. ఇండియా కూటమికి మూడు శాతం ఓట్లు వస్తాయని విశ్లేషించింది. ప్రతి పార్లమెంట్ స్థానంలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఈ లెక్కన కూటమికి 140 వరకు స్థానాలు దక్కే అవకాశం ఉంది.
మరోవైపు న్యూస్ 18 సంస్థ సైతం ఎన్డీఏ కూటమి ఏపీలో విజయం సాధిస్తుందని స్పష్టం చేసింది. 50% ఓట్లతో కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని తేల్చేసింది. వైసిపి 41% ఓట్లకు పరిమితం కానుందని.. ఇండియా కూటమికి ఆరు శాతం ఓట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పుకొచ్చింది. కూటమికి 18 పార్లమెంట్ స్థానాలు, వైసీపీకి ఏడు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని తేలింది. జగన్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ రెండు సర్వేలు తేల్చి చెప్పాయి. కాగా ఈ సర్వేలు టిడిపి శ్రేణుల్లో జోష్ నింపాయి. కానీ వైసీపీ శ్రేణులు మాత్రం తప్పుపడుతున్నాయి. ఫేక్ సర్వేలు గా తేల్చి చెబుతున్నాయి.