https://oktelugu.com/

Uttarandhra YCP: సీనియర్ల రాజకీయ సన్యాసం.. ఉత్తరాంధ్రలో వైసీపీకి కష్టకాలం!

ఉత్తరాంధ్ర అంటేనే టిడిపికి కంచుకోట.అటువంటి కంచుకోటను బద్దలు కొట్టారు జగన్.కానీ ఓటమి నుంచి తేరుకున్న టిడిపి గట్టి ఫైట్ చేసింది.మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేసింది. కానీ వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు.

Written By:
  • Dharma
  • , Updated On : December 9, 2024 / 02:58 PM IST

    Uttarandhra YCP

    Follow us on

    Uttarandhra YCP: వైసిపి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ ఎన్నికల్లో దారుణ పరాజయంతో హై కమాండ్ నిస్సత్తువగా మారిపోయింది.అయినా సరే అధినేత జగన్ ధైర్యం పోగుచేసుకుని ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధపడుతున్నారు.అయితే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన సీనియర్లు మాత్రం సైలెంట్ అవుతున్నారు. తాము పోరాటం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పరిస్థితి తీసుకట్టుగా మారింది. పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా ఉత్తరాంధ్ర నేతలకు జగన్ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఇప్పుడు పార్టీ కష్ట కాలంలో ఉంటే వారంతా ముఖం చాటేస్తున్నారు. కనీసం పార్టీ బాధ్యతలు తీసుకునేందుకు కూడా ముందుకు రావడం లేదు. వాస్తవానికి ఉత్తరాంధ్ర అంటే టిడిపికి పట్టుకొమ్మ అంటారు. అటువంటి టిడిపికి 2019లో దారుణ పరాజయం ఎదురయ్యింది. 34 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఉత్తరాంధ్రలో ఆ పార్టీ గెలిచింది కేవలం 6 చోట్ల మాత్రమే. అయితే అంది వచ్చిన అవకాశాన్ని వైసిపి సీనియర్లు సద్వినియోగం చేసుకోలేదు. అందుకే 2024లో ఘోర పరాజయం ఎదురైంది.34 అసెంబ్లీ సీట్లకు టిడిపికి అప్పట్లో ఆరు వచ్చాయి. కానీ ఈసారి వైసిపి రెండింటికే పరిమితమైంది.శ్రీకాకుళం,విజయనగరం జిల్లాలో అయితే కనీసం ఖాతా తెరవలేదు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంది తెలుగుదేశం. ఆ పార్టీ సీనియర్లు సమన్వయంతో పనిచేసి అధికారంలోకి రాగలిగారు. కానీ వైసీపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.ముఖ్యంగా సీనియర్లు తమ వారసులకు సరైన రాజకీయ జీవితం ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకే ఊగిసలాట లో ఉన్నారు.

    * శ్రీకాకుళంలో ఆ ఇద్దరు
    రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రక్షాళనకు దిగారు జగన్. ఈ క్రమంలో సీనియర్లు ఉన్నచోట వారిని ఆక్టివ్ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ధర్మాన ప్రసాదరావును ఆశ్రయించారు. పార్టీ ఇన్చార్జ్ పదవి తీసుకుని యాక్టివ్ కావాలని కోరారు.ఆసక్తి లేకపోతే సమర్థులైన నాయకుల పేర్లు సూచించమని కోరారు. దానికి ధర్మాన ప్రసాదరావు నుంచి ఇంతవరకు స్పందన రాలేదని తెలుస్తోంది. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రాతినిధ్యం వహించిన ఆమదాలవలసలో కొత్త ఇన్చార్జిని నియమించింది వైసిపి చింతాడ రవికుమార్ అనే యువకుడ్ని నియమించి బాధ్యతలు అప్పగించింది.దీంతో తమ్మినేని పార్టీలో ఉంటారా?ఉండరా?వేరే ఆలోచన చేస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.

    * పార్వతీపురం మన్యం జిల్లాలో
    పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి మాజీమంత్రి పీడిక రాజన్న దొర సైతం రాజకీయాలపై నిరాసక్తత వ్యక్తపరుస్తున్నారు. వరుసగా నాలుగు సార్లు సాలూరు ఎమ్మెల్యేగా గెలిచారు రాజన్న దొర. కానీ ఈసారి దారుణ పరాజయం ఎదురైంది. ఆయనపై గెలిచిన గుమ్మిడి సంధ్యారాణి కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. రాజకీయంగా రాటు తేలుతున్నారు. దీంతో ఇక రాజకీయాలకు స్వస్తి పలకడమే మేలన్న నిర్ణయానికి వచ్చినట్లు రాజన్న దొర సన్నిహితులు చెబుతున్నారు.మరోవైపు పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరాయ కళావతి రాజకీయాల పట్ల విముఖంగా ఉన్నారు. ఇప్పటికే తన అభిప్రాయాన్ని అధినేతకు వివరించారు. అక్కడ కొత్త నేత అన్వేషణలో పడింది వైసిపి.

    * పత్తాలేని మాజీ మంత్రులు
    విశాఖ జిల్లాలో సైతం సేమ్ సీన్. మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, పసుపులేటి బాలరాజు, అవంతి శ్రీనివాసరావు లాంటి నేతలు రాజకీయంగా కొనసాగడానికి పెద్దగా ఇష్టపడడం లేదు.ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు సైతం పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. రాజకీయాలు ఇక చాలు అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.అయితే నాయకులు వస్తూ ఉంటారు.. పోతూ ఉంటారు.. పార్టీ ఫైనల్.అందుకే వారు తమ వారసులను తెరపైకి తెస్తారా? లేకుంటే పార్టీ ప్రత్యామ్నాయ నేతలను ఎంచుకుంటుందా?అన్నది కాలమే నిర్ణయిస్తుంది.