Vallabaneni Vamshi : : గురువారం ఉదయం వల్లభనేని వంశీని హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. టిడిపి కేంద్ర కార్యాలయం పై నాడు వైసీపీ ప్రభుత్వంలో దాడి జరిగినప్పుడు.. ఆ వ్యవహారం మొత్తం వంశీ కనుసన్నల్లో జరిగిందని టిడిపి నాయకులు ఆరోపిస్తున్నారు. నాటి దాడికి సంబంధించి టిడిపి కేంద్ర కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసే సత్య వర్ధన్ అనే వ్యక్తి వంశీకి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.. అయితే కొద్ది రోజుల తర్వాత సత్య వర్ధన్ కిడ్నాప్ అయ్యారు. అనంతరం ఆయన కేస్ విత్ డ్రా చేసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇలాంటి ఘటన జరగడంతో టిడిపి శ్రేణులు దీనిని తీవ్రంగా పరిగణించాయి. అయితే ఒక్కసారిగా ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్ళిపోయారు. గురువారం ఉదయం వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనను ప్రత్యేక ఎస్కార్ట్ సహాయంతో విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడలో మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు తెలుస్తోంది. దానికంటే ముందు వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలుస్తోంది.. వల్లభనేని వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలిస్తున్న నేపథ్యంలో.. ఆమె భార్య ఆందోళన చెందారు. వెంటనే ఆమె కూడా తన వాహనంలో విజయవాడ బయలుదేరారు.
నందిగామలో అడ్డుకున్నారు
వల్లభనేని వంశీ భార్య కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్నట్లు తెలుసుకున్న ఏపీ పోలీసులు.. నందిగామ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆపేశారు. కారులో ఉన్న వ్యక్తిని కిందికి దించి.. వారు అందులోకి ఎక్కారు. ఆ తర్వాత వల్లభనేని వంశీ భార్యను తమ అదుపులోకి తీసుకున్నారు. ” నా భర్తను ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. ఆయన అరెస్టుపై నాకు ఆందోళనగా ఉంది. ఏం జరిగిందో తెలుసుకోవడానికి నేను అక్కడికి వెళ్తున్నాను. నా భర్త ప్రాణాలకు ప్రమాదం ఉంది. ఈ విషయంపై పోలీసులు ఎటువంటి క్లారిటీ నాకు ఇవ్వడం లేదు. అందువల్లే ఆందోళనతో హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చాను.. ఆయనను నేను చూడాలి. ఆయనను ఎందుకు అరెస్టు చేశారో నాకు తెలియాలి” అంటూ వల్లభనేని వంశీ భార్య పోలీసులతో వాదించినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఆమెను వారి అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఉదయం వల్లభనేని వంశీని అరెస్టు చేయడం.. మధ్యాహ్నం నందిగామ వద్ద ఆయన సతీమణిని అదుపులోకి తీసుకోవడంతో.. ఏపీ పోలీసులపై వైసీపీ నాయకులు భగ్గుమంటున్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపిస్తున్నారు.. పోలీసులు టిడిపి నాయకులు చెప్పినట్టు వింటున్నారని.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. అయితే వల్లభనేని వంశీ సతీమణిని పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారనేది ఇంతవరకూ తెలియ రాలేదు.