Arava Sridhar Controversy: ప్రతి రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ఒక రకమైన వైఖరి అనుసరిస్తుంటాయి. నిర్దిష్టమైన భావజాలాలు కూడా ఉంటాయి. వాటిని పూర్తిగా నమ్మేవారు మాత్రమే ఆ పార్టీలో రాణించగలరు. రాజకీయ పార్టీలు సంక్షోభాలను తట్టుకొని నిలబడతాయి అంటే అటువంటి నేతల సహకారంతోనే. ఎందుకంటే కొంతమంది తక్షణ రాజకీయ అవసరాల కోసం పక్క పార్టీల్లోకి మారుతుంటారు. కానీ అటువంటి వారు ఇమడలేరు. నేతల ఆలోచన ధోరణి, నాయకత్వం పట్ల నిబద్ధత లేని వారిని పార్టీలో చేర్చుకున్నా నష్టమే తప్ప లాభం ఉండదు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో అటువంటి పరిస్థితి ఉంది. సర్పంచ్ గా ఉన్న ఆయన ఎన్నికలకు నాలుగు రోజుల ముందు జనసేనలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఒక నేతను కాదని ఈయనకు అవకాశం కల్పించారు అప్పట్లో. అంటే గెలుపు గుర్రం అవుతారని భావించారు. కానీ ఇప్పుడు అదే అరవ శ్రీధర్ వివాదంలో చిక్కుకొని.. జనసేన పార్టీని చిక్కుల్లో పడేశారు.
* కేవలం రాజకీయ అవసరాలే..
ఇప్పటి రాజకీయ పార్టీలకు రాజకీయ అవసరాలే కనిపిస్తున్నాయి. ఫలానా నాయకుడు వస్తే గెలుపు మాత్రమే అనే రీతిలో ఆలోచన చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన దానం నాగేందర్ 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో టీడీపీలోకి వచ్చారు. అయితే ఆయనకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు కూడా. అయితే కాంగ్రెస్ పార్టీ ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. దీంతో మారు మాట చెప్పకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. బై పోల్స్ కు వెళ్లగా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా తెలంగాణలో సైతం 2023లో గులాబీ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి దూకేశారు. అప్పుడు టిడిపి చేసిన పని ఇప్పుడు గులాబీ పార్టీ చేసింది. పార్టీ సిద్ధాంతాలపై నమ్మకం లేని వారిని చేర్చుకొని మూల్యం చెల్లించుకుంది.
* ఎప్పటికైనా మూల్యం తప్పదు..
ఏ పార్టీకైనా ఇతర ఇతర పార్టీల రెడీమేడ్ నేతలను చేర్చుకోవడం మూల్యం చెల్లించుకోవడమే. అటువంటివారిని నమ్ముకోవడం కంటే పార్టీ పట్ల ప్రేమ, వీరాభిమానం, నమ్మకం ఉన్న వారికే ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం. అటువంటి వారే కష్టకాలంలో పార్టీని కాపాడుకుంటారు. అయితే అన్ని పార్టీల్లోనూ ఇటువంటి నేతలు ఉంటారు. కానీ రకరకాల సమీకరణల పేరు చెప్పి రెడీమేడ్ నాయకులకు ప్రాధాన్యం ఇస్తుంటాయి రాజకీయ పార్టీలు. ఎంతో నిబద్ధతతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఆ పార్టీ శ్రేణులు. వారిని కాదని అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను నమ్ముకున్నారు జగన్. అందుకు 2024 ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారు. పార్టీని నమ్మిన వారిని కాకుండా.. రెడీమేడ్ వారిని ఆశ్రయం కల్పిస్తే అలానే ఉంటుంది. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు బాధితులే. బాధిత వర్గాలే.