YCP Criticism CM Chandrababu: రాజకీయాలు వేరు.. అభివృద్ధి వేరు. రాజకీయాలు తాత్కాలికం. అభివృద్ధి అనేది శాశ్వతం. అభివృద్ధి వల్లే కొత్త అవకాశాలు పుడతాయి. ఉద్యోగాలు వస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. మరిన్ని పనులు చేపడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ అభివృద్ధిలో కూడా రాజకీయాలు వెతికితే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ఇప్పుడు ఏపీలో వైసిపి అదే పని చేస్తోంది. వై నాట్ 175 అని నినాదం చేసిన ఆ పార్టీ 11 సీట్లకు పరిమితం అయిపోయింది. జనాల్లో వ్యతిరేకతను అంచనా వేయకుండా ఈవీఎం లను మానిప్యులేట్ చేశారు అంటూ ఆరోపించడం ఆ పార్టీ నాయకులకు పరిపాటిగా మారిపోయింది. ఇప్పుడు ఏపీ అభివృద్ధికి అత్యంత తలమానికమైన గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా వైసిపి రాజకీయాలు చేస్తుంటే దానిని ఏమనుకోవాలో అర్థం కావడం లేదు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదాని డాటా సెంటర్ కు ఒప్పందం కుదుర్చుకున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఒకవేళ అదే కనుక నిజమైతే డాటా సెంటర్ ప్రారంభానికి శంకుస్థాపన ఎందుకు చేయలేదు.. నాడు జగన్ ప్రభుత్వం చేతిలో అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ అడుగు ముందుకు పడలేదు. వాస్తవానికి ఒక ఐడి కంపెనీ లేదా దానికి అనుసంధానమైన వ్యవస్థలు ఏర్పాటు కావాలంటే ఒక రోజుతోనే పూర్తికాదు. దానికి నిరంతరం ఫాలోఅప్ ఉండాలి. కంపెనీలను ఒప్పించగలగాలి. అనుకూలమైన వాతావరణం ఉందని చెప్పగలగాలి. రాయితీలు ఇవ్వాలి. విలువైన మానవ వనరులు ఉన్నాయని వివరించగలగాలి. ఇవన్నీ చేస్తేనే ఒక కంపెనీ పెట్టుబడి పెడుతుంది. అలాకాకుండా ఐపాక్ పెయిడ్ ఆర్టిస్టులతో గ్లోబల్ ఎకనామిక్ ఫోరం అని సొంత మీడియాలో డబ్బాలు కొట్టుకుంటే పెట్టుబడులు రావు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏఐ విప్లవంగా అభివర్ణించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరికి కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా గూగుల్ కంపెనీ ని ప్రసన్నం చేసుకోవడానికి వెనుకాడ లేదు. దీనినిబట్టి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంత పోటీ ఉందో అర్థం చేసుకోవచ్చు.
వాస్తవానికి గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతైతే ఉందో.. రాష్ట్ర ప్రభుత్వ కష్టం కూడా అంతే ఉంది. ముఖ్యంగా నారా లోకేష్ గూగుల్ ప్రతినిధులను నిత్యం కలుస్తూ.. వారితో నిత్యం మాట్లాడుతూ.. డాటా సెంటర్ ఏర్పాటుకు కృషి చేశారు. ఒకరకంగా ఇది ఏపీ ఆర్థిక రంగంలో కీలకమైన మైలురాయిగా పేర్కొనవచ్చు. కానీ ఈ విషయాన్ని గుర్తించడంలో వైసిపి పూర్తిగా విఫలమవుతోంది. ఇక్కడే ప్రజల్లో చులకనకు గురవుతోంది.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్ ప్రాంతంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యమంత్రి హాజరు కాలేదు. దీనికి కారణం బయటికి చెప్పలేదు. కానీ నాడు ఐటీ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్.. దావోస్ ప్రాంతంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి వెళ్లలేదని సెలవిచ్చారు. ఇటువంటి వ్యక్తి ఐటీ మంత్రిగా ఉన్న తర్వాత ఏపీకి పెట్టుబడులు ఎలా వస్తాయి? కంపెనీలు ఇలా ముందు అడుగు వేస్తాయి? ఏపీలో పెట్టుబడులకు సంబంధించి కోడి గుడ్డు కథ చెప్పిన అమర్నాథ్.. ఇప్పుడు google డాటా సెంటర్ పై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. పర్యావరణ కాలుష్యం అవుతుందని.. కరెంటు వినియోగం అధికమవుతుందని.. నీటి వినియోగం ఎక్కువగా ఉంటుందని.. ఇలా అడ్డగోలుగా సొంత మీడియాలో చెబుతున్నారు.
వాస్తవానికి ప్రతి ఆవిష్కరణ వెనుక ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. కరెంట్ తయారు చేస్తుంటే కాలుష్యం ఏర్పడుతోంది. అలాగని కరెంట్ తయారు చేయకుండా ఉండడం లేదు కదా.. వాహనాలు నడుపుతుంటే పొగ వస్తుంది.. అలా అని సొంత వాహనాలను నడపకుండా ఉండడం లేదు కదా.. కానీ ఈ విషయాన్ని గుర్తించడం వైసిపి కేడర్ మొత్తం పూర్తిగా విఫలమవుతోంది. అంతేకాదు అభివృద్ధిలో కూడా రాజకీయాలు చేస్తూ విష ప్రచారం చేస్తోంది. గూగుల్ డేటా సెంటర్ కోసం ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన పోటీ ఉంటే.. ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంచుకున్నదంటే గర్వంగా భావించాలి. తమకు గర్వకారణం అని అనుకోవాలి. కానీ ఈ విషయంలో వైసిపి నాయకులు బి గ్రేడ్ రాజకీయాలు చేస్తున్నారు. సొంత మీడియాలో గూగుల్ కంపెనీకి వ్యతిరేకంగా వార్తలు రాయిస్తున్నారు. దీనివల్ల తాత్కాలిక పైశాచిక ఆనందం ఉంటుందేమో గాని.. దీర్ఘకాలం మాత్రం ప్రజలు హర్షించరు.
జగన్ మీద ప్రజల్లో ఎలాంటి అభిప్రాయంతో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ విషయాన్ని మర్చిపోయిన వైసీపీ నాయకులు చంద్రబాబు మీద గుడ్డి వ్యతిరేకతతో మాట్లాడుతున్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటును అభినందించాల్సింది పోయి.. అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. గూగుల్ డాటా సెంటర్ వల్ల విశాఖ స్థాయి మరింత పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి. పన్నుల రూపంలో ఏపీకి డబ్బులు వస్తాయి. Google ఆల్రెడీ అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది కాబట్టి.. అనుబంధ వ్యవస్థలు కూడా ఏర్పాటు అవుతాయి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా విశాఖపట్నం కి గుర్తింపు లభిస్తుంది. ఈ విషయాన్ని వైసిపి గుర్తించడం లేదు.. పైగా చంద్రబాబు కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే అక్కసుతో అడ్డగోలుగా విమర్శలు చేస్తోంది. దీనివల్ల ప్రజల్లో చులకన కావడమే కాదు.. ఏపీ అభివృద్ధికి అడ్డుపడుతోంది. ఇప్పటికే ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను నష్టపోయింది. ఇలానే వ్యవహరిస్తే వైసిపి అనేది ఒకటి ఉండేదని చరిత్రలో చదువుకోవాల్సి ఉంటుంది.