CM Chandrababu: ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) గట్టిగానే కృషి చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కష్టపడుతున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో నిమగ్నమయ్యారు. చంద్రబాబు చేస్తున్న పనిని చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కానీ ఏదైనా పని ప్రారంభించి దానిని ముగిస్తేనే సత్ఫలితాలు వస్తాయి. అయితే ఈ విషయంలో చంద్రబాబుకు మాత్రం ఒక లోటు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ పరంగా అభివృద్ధికి లక్ష్యంగా పెట్టుకున్నారు. 1999లో అధికారంలోకి వచ్చిన తరువాత ఐటి అభివృద్ధి చేసి చూపించారు. మరోసారి అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కానీ 2004 ఎన్నికల్లో ఆయనకు దారుణ పరాజయం ఎదురైంది. 2009లో సైతం ప్రజలు చాన్స్ ఇవ్వలేదు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి సీఎం గా బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. విభజిత ఆంధ్ర ప్రదేశ్ కావడంతో అమరావతి రాజధానితో పాటు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. కానీ 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చారు. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తీసుకురావడమే కాదు అభివృద్ధి చేస్తున్నారు. కానీ 2029 ఎన్నికల్లో ప్రజలు మరోసారి ఆయనకు ఛాన్స్ ఇస్తేనే సత్ఫలితాలు ఉంటాయి. లేకుంటే మాత్రం గత అనుభవాలే పునరావృతం అవుతాయి.
* ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలి..
ఒక ప్రభుత్వానికి ఆయుష్షు ఐదేళ్లు మాత్రమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐదేళ్లలో పురోగతితో పాటు అభివృద్ధి అసాధ్యం. ఒక ప్రభుత్వ పనితీరును కొలవాలంటే ఐదేళ్లు చాలదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు( welfare schemes) పెరిగిపోయాయి. వాటిని అమలు చేస్తూనే అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందించాలి. ఇది నిజంగా సాహసంతో కూడిన చర్య. 2019లో సంక్షేమ పథకాల హామీలతో అధికారంలోకి వచ్చారు జగన్. ఆయనను గద్దె దించేందుకు అంతకుమించి సంక్షేమం అన్నట్టు కూటమి ప్రకటనలు చేసింది. ఇప్పుడు కచ్చితంగా వాటిని అమలు చేయాల్సి ఉంటుంది. లేకుంటే రాజకీయపరంగా విమర్శలు తప్పవు. ప్రజలు హర్షించరు. ఇటు సంక్షేమ పథకాలకు నిధులు కేటాయించాలి. అదే సమయంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలి. ఈ రెండింటితో ముందుకు వెళితే ఐదేళ్ల సమయం చాలదు. అందుకే 2029 ఎన్నికల్లో చంద్రబాబు నెగ్గితేనే ఈ అభివృద్ధి ఫలాలు అనేవి అంద గలవు. లేకుంటే గతం మాదిరిగా పరిస్థితులు పునరావృతం అవుతాయి.
* అభివృద్ధి పనులు కొనసాగాలి..
ఒక ప్రభుత్వం పథకాలతో పాటు అభివృద్ధి పనులను కొనసాగించే సంస్కృతి ఏపీలో లేదు. అది రాదు కూడా. అయితే వైసీపీతో( YSR Congress party) పోల్చుకుంటే టీడీపీ కూటమి ఆలోచనలు కొంత విభిన్నం. ఎందుకంటే వైసీపీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పనులను టిడిపి కూటమి కొనసాగించింది. కానీ దీనిని ప్రజలు గుర్తించాలి. వైసీపీ కేవలం సంక్షేమంతోనే ఎక్కువ కాలం గడిపేసింది. కానీ కూటమి ప్రభుత్వం అలా కాదు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. 17 నెలల అధికార కాలం ముగిసింది. ఇంకా 43 నెలల వ్యవధి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. అయితే సాధారణంగా రాజకీయ పార్టీలు అన్నాక.. ప్రభుత్వ పాలన అన్నాక కొన్ని రకాల లోపాలు, వైఫల్యాలు వస్తుంటాయి. విశాల ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఆలోచన చేయాల్సిన అవసరం ప్రజలపై ఉంది. సంక్షేమం మాత్రమే అవసరం అని భావించి ఉంటే ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేవారు. కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలని కూడా ప్రజలు ఎక్కువగా ఆకాంక్షించారు. అందుకే టిడిపి కూటమిని ఎన్నుకున్నారు. ఇప్పుడు అదే పనిలో కూటమి ఉంది. తేల్చుకోవాల్సింది ఏపీ ప్రజలు మాత్రమే.
* అవన్నీ యధాతధంగా కొనసాగాలంటే..
అమరావతి రాజధాని ( Amravati capital )నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పోలవరం పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పాలన సజావుగా నడుస్తోంది. సమయానుకూలంగా సంక్షేమ పథకాలు కూడా అమలవుతున్నాయి. ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి. పరిశ్రమలతో పాటు ఐటీ దిగ్గజ సంస్థల సైతం ఏపీ బాటపడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ప్రజలు స్థిరమైన ఆలోచనకు రావాల్సిన అవసరం ఉంది. మరోసారి ఇదే ప్రభుత్వాన్ని కొనసాగిస్తేనే కొంతవరకు ఫలితాలు ఉంటాయి. కానీ రాజకీయ ఇతరత్రా కారణాలతో ప్రభుత్వాన్ని గుర్తించకపోతే మాత్రం ఇబ్బందికరమే. ఇక తెలుసుకోవాల్సింది ఏపీ ప్రజలే.