YSR Congress : వైసీపీలో( YSR Congress ) నెంబర్ 2 ఎవరు? విజయసాయిరెడ్డి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? అధినేత ఇచ్చే టాస్క్ పూర్తి చేసేది ఎవరు? ఇప్పుడు ఇదే ఆసక్తికర చర్చ. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు వైసీపీలో విజయ సాయి ముగిసిన అధ్యాయం. ఆయన పాత్ర వైసీపీలో ఎవరు పోషిస్తారు? అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం. విజయసాయిరెడ్డి తో పాటు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి, అవినాష్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారు జగన్ కు అత్యంత సన్నిహితులు. అందుకే రాష్ట్రాన్ని ఐదు ప్రాంతాలుగా విభజించి.. వారందరికీ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీ పనుల కోసం ప్రత్యేకంగా ఒకరిని నియమిస్తుంటారు. అయితే ఇప్పటివరకు ఢిల్లీ బాధ్యతలను విజయసాయిరెడ్డి చక్కపెట్టేవారు. అదే సమయంలో ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల సమన్వయకర్తగాను పనిచేసేవారు. అటువంటి విజయసాయిరెడ్డి రాజీనామాతో.. ఆ స్థానాన్ని భర్తీ చేసే నేత ఎవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
* ఆ 11 మందిలో ఎవరు
ఈ ఎన్నికల్లో వైసీపీ( YSR Congress ) దారుణంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. గెలిచిన వారిలో పెద్దగా యాక్టివ్ అయిన నాయకులు కూడా లేరు. రిజర్వుడు నియోజకవర్గాల నుంచి గెలుపొందిన వారే. ఎంతోకొంత జగన్కు అండగా నిలిచేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అయితే ఆయన సైతం పెద్దగా యాక్టివ్ కాలేకపోతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చలాయించేవారు కానీ.. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దగా ప్రభావం చూపలేరని తెలుస్తోంది. అయితే పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డికి జగన్ ఎంతగానో ప్రాధాన్యమిస్తుంటారు. అవినాష్ రెడ్డి ఉన్న ఆయనపై ఉన్న కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అందుకే ఇప్పుడు విజయసాయిరెడ్డి స్థానాన్ని భర్తీ చేసేది మిధున్ రెడ్డి అని తెలుస్తోంది.
* వైసిపి ఆవిర్భావం నుంచి యాక్టివ్
వైసీపీ( YSR Congress ) ఆవిర్భావం నుంచి మిథున్ రెడ్డి చాలా యాక్టివ్ గా పని చేస్తున్నారు. 2014 నుంచి రాజంపేట ఎంపీగా గెలుస్తూ వచ్చారు. ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. మిధున్ రెడ్డి పై కూటమి అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. అయినా సరే మిధున్ రెడ్డి గెలుపొందడం విశేషం. మిధున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి నమ్మినబంటు. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. జగన్ ఇచ్చిన టాస్క్ ను ఇట్టే పూర్తి చేస్తారు మిథున్ రెడ్డి. అందుకే ఆయన పార్టీలో నెంబర్ టూ గా ఎదుగుతారన్న చర్చ నడుస్తోంది.
* ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక
ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ఎంపిక బాధ్యతను మిధున్ రెడ్డికి( Mithun Reddy) అప్పగించారు జగన్. ఈ ఎన్నికల్లో 80 మంది వరకు అభ్యర్థులను మార్చారు. అటువంటి సమయంలో అభ్యర్థుల స్క్రూట్ని.. ఇతరత్రా వ్యవహారాలు చూసింది మిధున్ రెడ్డి అని తెలుస్తోంది. అయితే గత కొంతకాలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి వైసీపీ యాక్టివిటీస్లో పాల్గొనడం తగ్గించారు. వారిపై రకరకాల ప్రచారం కూడా జరిగింది. అయితే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన రాజకీయ ప్రాబల్యం నిలుపుకుంటూ వచ్చారు. ఎన్నికల్లో ఆ కుటుంబం నుంచి ముగ్గురు గెలిచారు. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె నుంచి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి, రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి కుమారుడు మిథున్ రెడ్డి గెలిచారు. అందుకే ఆ కుటుంబాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని జగన్ నిర్ణయించారు. పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధపడుతున్నారు. ఢిల్లీలో సమన్వయం చేసే బాధ్యత కూడా ఆయనదేనని తెలుస్తోంది. మొత్తానికి అయితే వైసీపీలో నెంబర్ 2 గా ఎదిగే ఛాన్స్ మిధున్ రెడ్డికి ఉందన్నమాట.