Pawankalyan : పవన్ నియోజకవర్గం ఫిక్స్.. అక్కడైతే మామూలుగా ఉండదు

అందులో భాగమే వారాహి యాత్ర. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో జనసేన జెండా ఎగురవేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. గోదావరి జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేస్తేనే దాని ప్రభావం ఉంటుందని పవన్ భావిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో?

Written By: Dharma, Updated On : June 19, 2023 9:02 am
Follow us on

Pawankalyan : వారాహి యాత్రతో పవన్ దూకుడు మీద ఉన్నారు. ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో తనతో పాటు జనసేన నుంచి మెజార్టీ నేతలను కూర్చోబెడతానని శపధం చేస్తున్నారు. దీంతో గెలుపుపై పక్కా అంచనాతో పవన్ ముందడుగు వేస్తున్నారు. అయితే ఈసారి ఒక నియోజకవర్గం నుంచా? లేకుండా గతంలో మాదిరిగా రెండు నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతారా? అన్నది తెలియాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల నుంచి పవన్ కు ఆఫర్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో పోటీచేసిన గాజువాక, భీమవరం నియోజకవర్గాల ప్రజలు ఆహ్వానిస్తున్నారు. గత తప్పిదాన్ని పునరావృతం కాకుండా చూసుకుంటామని.. ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెబుతున్నారు.

ప్రధానంగా పవన్ రాయలసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేస్తారన్న ప్రచారం ఉంది. తిరుపతి నుంచి కానీ.. పిఠాపురం నుంచి కానీ పోటీచేసే చాన్స్ కనిపిస్తోంది. అయితే పిఠాపురంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. అందుకే తన వారాహి యాత్రను రెండు రోజుల పాటు పిఠాపురంలో ఉండేలా పవన్ ప్లాన్ చేశారు. అటు నియోజకవర్గ జనసేన నాయకులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అక్కడితో ఆగకుండా పిఠాపురంలో జనసేన కార్యాలయం ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇప్పటికే రాజమండ్రి, కాకినాడలో కార్యాలయాలున్నాయి. ఈ తరుణంలో పిఠాపురంలో మరో కార్యాలయం తెరుస్తానని చెబుతుండడంతో పవన్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

గత ఎన్నికల్లో ఇక్కడ జనసేన అభ్యర్థి గణనీయమైన ఓట్లు సాధించారు. మొత్తం నియోజకవర్గంలో 2 లక్షలు పైచిలుకు ఓట్లకుగాను… కాపులదే సింహభాగం. దాదాపు 75 వేల కాపు ఓటర్లు ఉంటారని అంచనా. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీచేసిన పెండ్యం దొరబాబు 83,449 ఓట్లు సాధించారు. టీడీపీ అభ్యర్థి వర్మకు 68,470 ఓట్లు వచ్చాయి. మూడోస్థానంలో నిలిచిన శేషుకుమారికి 28,011 ఓట్లు వచ్చాయి. జనసేనకు ఎక్కువ ఓట్లు పోలైన నియోజకవర్గాల్లో ఇది కూడా ఒకటి. దీంతో ఇక్కడ పవన్ పోటీచేస్తే నల్లేరుపై నడకేనని జనసేన శ్రేణులు నమ్మకంగా చెబుతున్నాయి.

అయితే ఈసారి ఒకటికి రెండుసార్లు ఆలోచించే పవన్ బరిలో దిగుతారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో వ్యూహాత్మకంగా రెండు నియోజకవర్గాల్లో పోటీచేసినా నిరాశే ఎదురైంది. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అలా కాదు. తనతో పాటు పదుల సంఖ్యలో జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టాలని పవన్ బలమైన నిర్ణయానికి వచ్చారు. అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. తమకు బలమున్న నియోజకవర్గాల్లో మరింత శక్తిని కూడదీసుకోవాలని చూస్తున్నారు. అందులో భాగమే వారాహి యాత్ర. ఉభయ గోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాల్లో జనసేన జెండా ఎగురవేయాలని కృతనిశ్చయంతో ఉన్నారు. గోదావరి జిల్లాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీచేస్తేనే దాని ప్రభావం ఉంటుందని పవన్ భావిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందో?