Pawankalyan : వైసీపీ నేతలకు దూకుడు ఎక్కువ. ప్రశ్నిస్తే తట్టుకోలేకపోవడం, సమస్యలను ప్రస్తావిస్తే విరుచుకుపడడం వారి నైజం. రాజకీయ హుందాతనం వారిలో అస్సలు కనిపించదు. రాజకీయ విమర్శలను తిప్పికొట్టలేరు. కానీ వ్యక్తిగత హననం మాత్రం వారికి వెన్నతో పెట్టిన విద్య. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రత్యర్థులను ఎంతలా చెడుగుడు ఆడుకోవాలో వారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఇక ఏపీలో విపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ చేసే విన్యాసాలు అన్నీఇన్నీకావు. ముఖ్యంగా పవన్ విషయంలో వైసీపీ నేతల తీరు ఒకేలా ఉంటుంది. సీఎం జగన్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకూ విరుచుకుపడే తీరు అభ్యంతరకరంగా ఉంటుంది. అందుకే దీనిపై గట్టిగానే రిప్లయ్ ఇచ్చేందుకు పవన్ సిద్ధపడ్డారు. తాజాగా వారాహి యాత్రలో అటువంటి సంకేతాలే ఇచ్చారు.
దత్తపుత్రుడు, మూడు పెళ్లిళ్లు.. పవన్ పై జగన్ చేసే తరచూ ఆరోపణలివి. వ్యక్తిగత విమర్శలొద్దు అని పవన్ కోరినా సీఎం జగన్ నుంచి వైసీపీ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదు. పవన్ రాజకీయ విమర్శలు, ప్రభుత్వ వైఫల్యాలు ప్రస్తావించిన ప్రతిసారి వ్యక్తిగతంగానే టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల అమ్మఒడి ప్రారంభోత్సవ సభలో సైతం సీఎం జగన్ పవన్ వైవాహిక జీవితంపై మాట్లాడారు. చివరకు వారాహి వాహనాన్ని కూడా చులకన చేసి మాట్లాడారు. లారీ అని సంభోదిస్తూ దానిపై పూనకం వచ్చినట్టు మాట్లాడతాడని సీఎం ఎద్దేవా చేశారు. అటు మంత్రులు, వైసీపీ నాయకులు జగన్ నే అనుసరిస్తున్నారు. దీంతో ముల్లును ముల్లుతో తీయ్యాలని పవన్ డిసైడయ్యారు.
వారాహి యాత్రలో సీఎం జగన్ భార్య భారతి గురించి ప్రస్తావించారు. ‘మీ సతీమణి భారతి గారు నాకు సోదరి సమానురాలు. నేనెప్పుడూ ఆమె ప్రస్తావన తీసుకురాలేదు. జగన్ మాత్రం నా భార్యను పెళ్లాం అని సంబోధిస్తారు. భారతి గారూ…మీ కాళ్లు మొక్కుతా. మీ వారిని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి. మేం మిమ్మల్ని చాలా గౌరవంగా మాట్లాడతాం. మీ వారినీ అలాగే మాట్లాడాలని చెప్పండి” అని రెండు చేతులు జోడించి మరీ వేడుకోవడం విశేషం. అంతేకాదు, తన భార్యల్ని పెళ్లాలని జగన్ అనడంపై కూడా పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మొత్తానికైతే పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పవన్ లేవనెత్తిన అంశాల్లో న్యాయం ఉందని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు.
జగన్ గతంలో చాలా సందర్భాల్లో పవన్ పై కామెంట్స్ చేశారు. అప్పట్లో పవన్ కూడా ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడొద్దని హితవుపలికారు. ఇష్టపూర్వకంగా విడాకులు ఇచ్చాకే తాను వివాహాలు చేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. వైసీపీ నేతల్లా తాను స్టెప్నీలను పెట్టుకోలేదని కూడా ఎద్దేవా చేశారు. మరోసారి అటువంటి వ్యాఖ్యలు చేస్తే.. అంతకు మించి కామెంట్స్ ఉంటాయంటూ హెచ్చరికలు పంపారు. అయినా సరే వైసీపీ నేతల్లో తీరు మారలేదు. సాక్షాత్ సీఎం జగనే మరోసారి పవన్ వైవాహిక జీవితంపై మాట్లాడారు. అందుకే ఇప్పుడు పవన్ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు.