Pawan Kalyan: గొప్ప విజనరీతో పవన్.. ఆంధ్ర ప్రదేశ్ రాత మార్చే కీలక నిర్ణయం

తెలుగు ప్రజలు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆరోజు మట్టి వినాయకుడిని పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పవన్ ఆదేశించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో మట్టి వినాయకుడి విగ్రహాన్ని పూజించేలా ఏర్పాట్లు చేయాలని పవన్ సూచించడం విశేషం. దేవాలయాల్లో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని కూడా ఆదేశించారు.

Written By: Dharma, Updated On : July 9, 2024 11:22 am

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కు పర్యావరణ పరిరక్షణ అంటే చాలా ఇష్టం. అందుకే జనసేన సిద్ధాంతాల్లో పర్యావరణ పరిరక్షణకు సైతం పెద్దపీట వేశారు. కూటమి ప్రభుత్వంలో తనకు ఇష్టమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలతో పాటు పర్యావరణ శాఖను దక్కించుకున్నారు. గ్రామాల్లో స్వచ్ఛత దిశగా అడుగులు వేయాలని.. పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు పవన్. ఆరు నెలల్లో గ్రామాల రూపురేఖలు మారాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మరో సాహస నిర్ణయాన్ని తీసుకున్నారు. మరి కొద్ది రోజుల్లో వినాయక చవితి వేడుకలు జరగనున్న సంగతి తెలిసిందే. వాటిని పర్యావరణహితంగా చేసుకోవాలని పవన్ పిలుపునివ్వడం విశేషం.

తెలుగు ప్రజలు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఆరోజు మట్టి వినాయకుడిని పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పవన్ ఆదేశించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో మట్టి వినాయకుడి విగ్రహాన్ని పూజించేలా ఏర్పాట్లు చేయాలని పవన్ సూచించడం విశేషం. దేవాలయాల్లో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించాలని కూడా ఆదేశించారు. సాధారణంగా దేవాలయాల్లో ప్రసాదాన్ని బటర్ పేపర్ తో చేసిన కవర్లలో అందిస్తారు. అయితే వాటితో అందించకుండా.. తాటాకు బుట్టలు, ఆకుల దొన్నెలు వాడాలని పవన్ సూచించారు. ఈ తరహా ప్రయోగాన్ని పిఠాపురం ఆలయాల నుంచే ప్రారంభించాలని కూడా సూచించారు. తన సొంత నియోజకవర్గంలో మార్పు చేసి చూపితే.. రాష్ట్రమంతా మార్పు తీసుకురావచ్చు అన్న భావనతో పవన్ దీనికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

వినాయక చవితి నాడు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వినియోగంతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతూ వస్తోంది. ఆ విగ్రహాల నిమజ్జనంతో జలాలు సైతం కలుషితం అవుతున్నాయి. ప్రజారోగ్యానికి తీవ్ర భంగం వాటిల్లుతూ వస్తోంది. అందుకే మట్టి విగ్రహాలను వినియోగించాలని స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ వచ్చాయి. అయినా సరే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు చలామణి అవుతూ వచ్చాయి. ఎక్కువమంది ఆవిగ్రహాలనే వినియోగించారు. ఇటువంటి పరిస్థితుల్లో పవన్ ప్రత్యేకంగా యంత్రాంగానికి ఆదేశాలు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనా పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేసేలా ఉన్నాయి.