Pawankalyan : వచ్చే ఎన్నికల్లో గెలుపు తెలుగుదేశం పార్టీకి అత్యంత ఆవశ్యం. ఆ పార్టీకి జీవన్మరణ సమస్య. అందుకే చంద్రబాబు ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తున్నారు. ఆచీతూచీ నిర్ణయాలు తీసుకుంటారు. పొత్తుల నుంచి అభ్యర్థుల ఖరారు వరకూ మొహమాటాలకు, మాట పట్టింపులకు పోదలచుకోలేదు. సీనియర్ల స్థానాలను ఫిక్స్ చేస్తూ..మరోవైపు మేనిఫెస్టోపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా వైసీపీ సంక్షేమ ఓటు బ్యాంక్ కొల్లగొట్టేందుకు పావులు కదుపుతున్నారు. మరోవైపు బీజేపీ నుంచి పొత్తుల పురోగతి లేకపోవడం, పవన్ వ్యవహార శైలి మారడం వంటి వాటితో సొంత బలం, బలగంతో ఎన్నికలకు సిద్ధం కావడానికి డిసైడయ్యారు.
ఆ మధ్యన ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. వారి నుంచి సానుకూలత వచ్చినట్టు చంద్రబాబు ప్రకటించారు. మరిన్ని సమావేశాల తరువాత పొత్తులు కుదురుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే తరువాత ఆ ఇద్దరు నేతలు ఏపీ పర్యటనకు వచ్చారు. కానీ పొత్తులపై ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు. కేవలం జగన్ సర్కారు అవినీతిని ప్రశ్నించడం కాస్తా ఉపశమనం కలిగించే విషయం. కానీ జగన్ సర్కారుపై బీజేపీ నేతలు ఎప్పటి నుంచో అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఎక్కడా పొత్తులపై మాత్రం మాట్లాడలేదు.
నాకు పదవులతో పనిలేదు. ప్రజలు ఇస్తే మాత్రం తీసుకుంటానని పవన్ చెప్పడంతో చంద్రబాబు ఖుషీ అయ్యారు. పవర్ షేరింగ్ ఉండదని టీడీపీ శ్రేణులు రిలాక్స్ అయ్యారు. కానీ వారాహి యాత్రలో పవన్ స్ట్రాటజీ మార్చారు. జనసేనకు ఓటెయ్యండి. నాకు సీఎం చాన్స్ ఇవ్వండి. అంటూ కొత్త స్లోగన్ ప్రారంభించడంతో చంద్రబాబు స్ట్రగుల్ అవ్వడం ప్రారంభించారు. పవన్ మదిలో ఏదో కొత్త ఆలోచన ఉందని అనుమానిస్తున్నారు. తాను వ్యూహం మార్చుకోవాల్సిన అనివార్య పరిస్థితి చంద్రబాబుకు ఎదురైంది.
పొత్తులు కుదిరితే కుదిరాయ్.. లేకుంటే లే. బీజేపీ వస్తే వచ్చింది లేకుంటే లే. ఇప్పుడు టీడీపీలో ఈ స్లోగన్ ప్రారంభమైంది. సొంత కాళ్లపై నిలబడేందుకు చంద్రబాబు సైతం యత్నాలు ప్రారంభించారు. పొత్తుల డోర్లు మూసుకుపోలేదు. అలాగని కలిసిరానని బీజేపీ ప్రకటించలేదు. అందుకే ఈలోగా ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే ఎన్నికల్లో పార్టీకి మంచి మైలేజీ ఉంటుందని భావిస్తున్నారు. అందుకే పార్టీ శ్రేణులకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మేనిఫెస్టోతో బలంగా ప్రజల్లోకి వెళ్లాలని దిశా నిర్దేశం చేశారు.