NDA Meet – Pawankalyan : ఏపీ రాజకీయాలపై స్పష్టత రావడం లేదు. నిన్నిటి ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఏపీపై ఒక తుదిరూపు వస్తుందని భావించారు. కానీ ఆ సమావేశం కేవలం జాతీయస్థాయి రాజకీయాలకే పరిమితమైంది. ఎన్డీఏ బలోపేతంపై చర్చలు సాగినట్టు తెలుస్తోంది. సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ మాత్రమే హాజరయ్యారు. దీంతో ఆయనే సమావేశంలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. తెలంగాణలో ఈ ఏడాది చివర్లో.. ఏపీలో వచ్చే వేసవిలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పవన్ సమక్షంలో తెలుగు రాష్ట్ర రాజకీయాల విషయంలో బీజేపీ పెద్దలు స్పష్టతనిస్తారని భావించారు. కానీ ఎటువంటి చర్చ జరగకుండానే సమావేశం ముగిసింది.
అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సమావేశం హీట్ పెంచింది. పవన్ సైతం ఏపీ, తెలంగాణ గురించి సమావేశంలో చర్చిస్తామని చెప్పడంతో ఎనలేని ప్రాధాన్యం పెరిగింది. కానీ సమావేశం మొత్తం ఎన్డీఏ బలోపేతంపైనే సాగింది. అందులో భాగంగా ఏపీ గురించి చర్చించారా? అంటే మాత్రం స్పష్టత లేదు. ప్రధానంగా ఏపీలో పాలక పక్షం వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్డీఏ పట్ల సానుకూలంగా ఉన్నాయి. కానీ వాటికి ఎంట్రీ విషయంలో బీజేపీ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తోంది. ఒక్క జనసేన విషయంలో మాత్రమే సానుకూలంగా ఉంది.

ఎన్డీఏ పక్షాల సమావేశం నుంచి ఎటువంటి సానుకూలాంశాలు లేకపోవడంతో అటు వైసీపీ, ఇటు టీడీపీ నానా హైరానా పడుతున్నాయి. పైగా పవన్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడంతో కలవరపాటుకు గురవుతున్నాయి. పవన్ తమను ఎక్కడ విడిచిపెట్టి వెళ్తాడో అని చంద్రబాబు.. కేంద్రంతో చెప్పి తమను ఓ ఆట ఆడుకుంటాడని జగన్ భయపడ్డారు. అటు సమావేశంలో చర్చించిన అంశాలు సైతం బయటకు రావడం లేదు. కానీ ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారు. ఎల్లో మీడియా బీజేపీ, జనసేన, టీడీపీ కలిసే బరిలోకి అని పవన్ అన్నట్టు రాసింది. నీలి మీడియా మాత్రం కనీసం పవన్ పేరు పెట్టేందుకు కూడా ఇష్టపడలేదు. ఎన్డీఏ సమావేశానికి హాజరైన చిన్నచిన్న పార్టీల అధినేతల పేర్లు రాసిన సాక్షి మీడియా పవన్ పేరు లేకుండానే వార్త రాసుకొచ్చింది.
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం అనంతరం పవన్ విలేఖర్లతో మాట్లాడారు. సమావేశ వివరాలు వెల్లడించారు. ఏపీ రాజకీయాల గురించి చర్చ జరగలేదని.. దేశ రాజకీయ పరిస్థితులపైనే చర్చించినట్టు తెలిపారు. దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేశ నాయకత్వ బాధ్యతలు మోదీ తీసుకున్నారని గుర్తుచేశారు. ఆయన విధానాలను నచ్చే తాను ఎన్డీఏకు సపోర్టు చేసినట్టు చెప్పుకొచ్చారు. పటిష్ట నాయకత్వంతోనే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు కూడా గుర్తించారన్నారు. ఏపీలో ఎన్డీఏ గూటికి మరో పార్టీ చేరుతుందన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు పవన్ స్పందించారు. రాజకీయాల్లో ఏదైన జరగవచ్చని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు. అయితే దానికి ఎల్లో మీడియా వక్రీకరించింది. మూడు పార్టీలతో బరిలోకి అని ప్రచారం ప్రారంభించింది. నీలిమీడియా మాత్రం అసలు పవన్ ప్రస్తావన తీసుకురాలేదు.