Pawankalyan Vs YS Jagan : పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు. తన యుద్ధం వలంటీర్లపై కాదని.. వారి పొట్టకొట్టడం తన ఉద్దేశ్యం కాదని తేల్చిచెప్పారు. రూ.5 వేలతో వారితో ఊడిగం చేయిస్తున్నారని.. వలంటీరు అంటే వ్యక్తి మాత్రమేనని.. కానీ ఆ వ్యవస్థ సమూహాన్ని జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. వలంటీర్ల వ్యవస్థను ముందుపెట్టి ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారని కామెంట్స్ చేశారు. రాజకీయ సమాంతర వ్యవస్థను నడిపిస్తున్న జగన్ పైనే నేరుగా ఆరోపణలు చేశారు. కానీ జగన్ దీనికి సమాధానం చెప్పడం లేదు. వలంటీర్లను ఉసిగొల్పుతున్నారు. ఆందోళనల పేరిట దిష్టిబొమ్మలను దహనం చేయిస్తున్నారు. ఆందోళన చేయకుంటే ఉద్యోగాలు పోతాయని హెచ్చరిస్తుండడంతో విధి లేక వారు రోడ్డుపైకి వస్తున్నారు.
పవన్ ఆరోపణలు చేసింది జగన్ పైన. ఆయన వెనుక ఉండి నడిపిస్తున్న రాజకీయాలుపైన. కానీ జగన్ వాటికి సమాధానం చెప్పేందుకు ముందుకు రావడం లేదు. వలంటీర్లు వెనుక నక్కి ఇప్పటికీ రాజకీయాలు చేస్తున్నారు. వాస్తవానికి పవన్ వలంటీర్లను వ్యక్తిగతంగా ఏమీ అనలేదు. వారి నియామకం వెనుక అసలు ఉద్దేశ్యాన్ని మాత్రమే బయటపెట్టారు. అత్తెసరు జీతం ఇచ్చి వారితో చేయకూడని పనులు చేయిస్తున్నారని చెప్పుకొచ్చారు. దీనినే హైలెట్ చేస్తూ పవన్ ప్రశ్నించారు. దీనిపై సమాధానం చెప్పాల్సిన జగన్ మాత్రం పట్టకుండా వ్యవహరిస్తున్నారు. తనకేమీ తెలియదని నటిస్తున్నారు.
అయితే ఆది నుంచి సీఎం జగన్ చర్యలు ఇలానే ఉన్నాయి. పాలనా వైఫల్యాలపై విమర్శలొస్తే స్పందించరు. విపత్తులపై చర్చించరు. అసలు విలేఖర్ల సమావేశం నిర్వహించరు. ప్రభుత్వ పాలనలో మంచీ చెడుల గురించి అస్సలు తెలుసుకోరు. ఎదుటి వారి అభిప్రాయాలను అస్సలు గౌరవించరు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు లేవు. తన విధానాలను సైతం గట్టిగా చెప్పలేని స్థితిలో ఉన్నారు. జీవీడీ కృష్ణ మోహన్ రాసే స్క్రిప్టులను బహిరంగ సభల్లో చదివేసి వెళ్లిపోతున్నారు. వలంటీరు వ్యవస్థలో లోపాలను పవన్ ఎత్తిచూపారు. విపక్ష నేతగా ఆయన బాధ్యతను నెరవేర్చారు. కానీ జగన్ మాత్రం దానికి సమాధానం చెప్పడంలో చతికిలపడుతున్నారు. అయితే పవన్ మాత్రం తన యుద్ధం ఆపడం లేదు. తన వాయిస్ ను ప్రజల్లోకి బలంగా పంపుతున్నారు.