Pawan Kalyan : ఏపీలో రేషన్ బియ్యం దందాపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల బియ్యం విదేశాలకు తరలిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాకినాడ పోర్టు నుంచి సౌత్ ఆఫ్రికా కు 640 టన్నుల బియ్యంతో వెళ్తున్న షిప్ పట్టుబడిన సంగతి తెలిసిందే. కాకినాడ జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ ఆ షిప్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి నాదెండ్ల మనోహర్ పట్టుబడిన షిప్ తో పాటు బియ్యాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులకు బాధ్యత లేదా?అని ప్రశ్నించారు.వైసిపి ప్రభుత్వ హయాంలో భారీగా కాకినాడ పోర్టు నుంచి బియ్యం తరలిపోవడంపై పవన్ విమర్శలు వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చినా.. ఇంకా బియ్యం తరలిపోతుండడంపై ఆవేదన వ్యక్తం చేశారు పవన్.
* అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే పై విమర్శలు
అప్పట్లో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు కీలకంగా వ్యవహరించారు ఈ దందాలో. ఆయనపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పవన్ సైతం ఆయన పేరును ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కూడా. అయితే అదే కాకినాడ పోర్టు నుంచి ఇప్పుడు కూడా రేషన్ బియ్యం తరలిపోతుండడం పై సీరియస్ గా ఉన్నారు పవన్. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు.రేషన్ బియ్యం మాఫియా కు కాకినాడ పోర్టు హబ్ గా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బియ్యం మాఫియా వెనుక ఎంతటి వారున్నా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు పవన్.
* అధికారుల ఉరుకులు పరుగులు
మరోవైపు పవన్ ఆదేశాలతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. కొద్ది రోజుల కిందట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పోర్టు ప్రాంతాన్ని పరిశీలించారు. బియ్యం తరలింపు విషయంలో సీరియస్ ఆదేశాలు జారీ చేశారు. కానీ అక్కడ బియ్యం తరలింపు ప్రక్రియ మాత్రం ఆగలేదు. ఇంకా పెరుగుతుండడం పై స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ రంగంలోకి దిగారు. నేరుగా సౌత్ ఆఫ్రికాకు బియ్యంతో వెళ్తున్న షిప్ ను పరిశీలించారు. అక్కడికక్కడే సీరియస్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికార యంత్రాంగంలో ఒక రకమైన చలనం ప్రారంభం అయ్యింది. మరోవైపు రాష్ట్రస్థాయిలో బియ్యం మాఫియా విషయంలో ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.