Pawankalyan : ఫలించిన పవన్ కళ్యాణ్ వ్యూహం

రెండు మీడియాలు పవన్ కార్యక్రమాలకు బాగానే కవరేజ్ ఇస్తున్నాయి. మొత్తానికైతే తెలుగు మీడియా విషయంలో పవన్ వ్యూహం పక్కాగా పనిచేసిందన్న మాట. 

Written By: Dharma, Updated On : June 19, 2023 10:36 am
Follow us on

Pawankalyan : జనసేనాని పవన్ కు మీడియా సపోర్టు అంతంతమాత్రం. ఎల్లో, నీలి మీడియాలు కవరేజ్ ఇవ్వవు. జనసేన ఆవిర్భావం నుంచి ఈ రెండు మీడియాలు పవన్ పై విషం చిమ్ముతునే ఉన్నాయి. వైసీపీ రాజకీయ ప్రయోజనాలు నీలి మీడియాకు అవసరం. టీడీపీ రాజకీయ ప్రయోజనాలు ఎల్లో మీడియాకు ఆవశ్యంగా మారాయి. అందుకే ఎప్పటికప్పుడు రంగులు మార్చుకుంటూ ఈ రెండు మీడియాలు పవన్ పై కుట్రలు చేస్తూనే ఉన్నాయి. అందుకే వారాహి యాత్ర కవరేజ్ విషయంలో పవన్ పక్కా వ్యూహాంతో ముందుకెళ్లడంతో ఈ రెండు మీడియాలు అందులో చిక్కుకున్నాయి.

ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర కొనసాగుతోంది. అటు ఎల్లో, ఇటు నీలి మీడియాల్లో జగన్ కు కవరేజ్ దక్కుతోంది. అయితే దీని వెనుక పవన్ పక్కా స్కెచ్ ఉంది. పవన్ ప్రసంగ శైలిని ఈ రెండు మీడియాలు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో జనసేనను గెలిపించాలని..సీఎంగా తనకు ఒక చాన్స్ ఇవ్వాలని పవన్ కోరుతున్నారు. నీలి మీడియాలో ఈ లైన్ తీసుకొని పతాక శీర్షికన కథనాలను ప్రచురిస్తున్నారు. వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండడంతో దానిని ఎల్లో మీడియా హైలెట్ చేసి కథనాలను, వార్తలను వండి వార్చుతోంది.

అయితే గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. పవన్ కు కనీస కవరేజ్ ఇచ్చిన దాఖలాలు లేవు. కేవలం పవన్ పై విమర్శనాస్త్రాల కథనాలకే ప్రయారిటీ ఇచ్చేవారు. ఇప్పుడు పవన్ రోడ్డుపైకి వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నాయి. పొత్తు లేదన్న సంకేతాలను చూసి నీలి మీడియా సంబరపడిపోతోంది., పొత్తు ఎక్కడ కాకుండా పోతుందోనని ఎల్లీ మీడియా మదనపడుతోంది. ఈ క్రమంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక.. రెండు మీడియాలు పవన్ కార్యక్రమాలకు బాగానే కవరేజ్ ఇస్తున్నాయి. మొత్తానికైతే తెలుగు మీడియా విషయంలో పవన్ వ్యూహం పక్కాగా పనిచేసిందన్న మాట.