Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చాలా విషయాల్లో ముక్కుసూటిగా ఉంటారు. ఏ విషయం అయినా నిర్మొహమాటంగా చెప్పేస్తారు. తాజాగా అభిమానులపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. వారి తీరును తప్పు పట్టారు. ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా? అంటూ నిట్టూర్చారు. పవన్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ పై వైసీపీ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయనను శనివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. జవహర్ బాబు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం మీడియాతో మాట్లాడారు పవన్. ఎట్టి పరిస్థితుల్లో బాధ్యులను విడిచి పెట్టేది లేదని హెచ్చరించారు.జగన్ ముందుగా తన పార్టీ వర్గాలను నియంత్రించుకోవాలన్నారు. ప్రజలు 11 సీట్లు ఇచ్చినా.. ఇంకా ఆధిపత్యం ప్రదర్శిస్తామంటే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. దాడికి పాల్పడిన వారు ఎంతటి స్థాయి వ్యక్తులైన విడిచి పెట్టేది లేదని హెచ్చరించారు.
* అభిమానులపై అసహనం
అయితే పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో అభిమానులు చికాకు పెట్టారు. ఓజి ఓజి ఓజి అంటూ నినాదాలు చేశారు. దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు పవన్.ఏంటయ్యా మీరు.. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు.. పక్కకు రండి అంటూ అసహనం వ్యక్తం చేశారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. కీలక శాఖలకు మంత్రిగా, ఏపీ డిప్యూటీ సీఎం గా, జాతీయస్థాయిలో ఎన్డీఏ నేతగా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. మధ్యలో తాను నటిస్తున్న ఓజీ,హరిహర వీరమల్లు చిత్రాల షూటింగ్లో పాల్గొంటున్నారు.
* భారీగా ఫ్యాన్స్ రాక
పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎవరికీ చెప్పనవసరం లేదు. ప్రస్తుతం పవన్ రాష్ట్ర స్థాయి పర్యటనలు చేస్తున్నారు.ప్రతి జిల్లాను టచ్ చేస్తున్నారు.ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు పవన్. ఆయన పర్యటనల సమయంలో జన సమీకరణ ఉండదు. జనం స్వచ్ఛందంగా తరలి వస్తుంటారు. అన్నమయ్య జిల్లా పర్యటనలో సైతం అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కానీ వారు సినిమాకు సంబంధించి కేకలు వేయడంతో అసహనం ప్రదర్శించారు పవన్.అయినా అభిమానులు తమ నాయకుడి గొప్పతనం అది అంటూ అభిమానించడం విశేషం.