Pawan Kalyan: ఏపీ పొలిటికల్ సర్కిల్లో జనసేనది ప్రత్యేక స్థానం. పార్టీ ఆవిర్భవించిన తర్వాత క్రమేపీ ప్రజల్లోకి వెళ్ళింది. అవమానాలను, అపజయాలను అధిగమించి సంపూర్ణ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన 21 చోట్ల శత శాతం విజయంతో దూసుకెళ్లింది. ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్. మరింత దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఇటీవల సనాతన ధర్మ పరిరక్షణ కోసం ముందుకు వచ్చారు పవన్. జాతీయస్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం పటిష్ట వ్యవస్థ అవసరమని పవన్ భావించారు. పవన్ లేవనెత్తిన అంశాలు జాతీయస్థాయిలో కూడా చర్చకు దారి తీసాయి. తాజాగా జనసేన పార్టీలో ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేసి దేశంలో అన్ని రాజకీయ పార్టీలు జనసేన వైపు చూసేలా చేశారు పవన్. నరసింహ వారాహి గణం పేరుతో జనసేనలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.సనాతన ధర్మాన్ని ఆచరిద్దాం.. ఎదుటి మతాలను గౌరవిద్దాం.. అన్న స్లోగన్ తో జనసేనలో ఈ కొత్త విభాగం ఏర్పాటు కావడం విశేషం.
* సరికొత్త వింగ్ ఏర్పాటు
మనం నమ్మే ధర్మం పట్ల నిర్భయంగా మాట్లాడాలి. దానికి విఘాతం కలిగితే స్పందించాలి అన్నది పవన్ కళ్యాణ్ చెబుతున్న మాట. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆయన ఎక్కువగా సనాతన ధర్మం, హిందుత్వవాదం గురించి ప్రస్తావిస్తున్నారు. అయితే దీనిని ఎక్కువ మంది ఆహ్వానిస్తున్నారు. అదే స్థాయిలో వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. తాజాగా పవన్ సనాతన ధర్మ పరిరక్షణ ప్రకంపనలు బీహార్ లో వచ్చాయి. ఆ రాష్ట్రంలో బలమైన చర్చ ప్రారంభం అయ్యింది. అధికార విపక్షాల,మధ్య విమర్శలకు కారణమవుతోంది.
* బీహార్ బిజెపి నేతల స్వాగతం
పవన్ ప్రకటనలను బీహార్ బిజెపి నేతలు ఆహ్వానించారు. సంతోషం వ్యక్తం చేశారు. బీహార్ లో కూడా ఇలాంటి ఒక వింగ్ ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బీహార్ మంత్రి నీరజ్ బాబు తాజాగా వెల్లడించారు. దీనివల్ల సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవచ్చు అని తెలిపారు. దీనిపై అక్కడి విపక్షం ఆర్జేడి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలో క్షేత్రస్థాయి పరిస్థితుల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకేనని మండిపడుతోంది. ఇలాంటి వారంతా నకిలీ సనాతనీయులని చెబుతోంది. మొత్తానికి అయితే పవన్ ప్రకటన ఇతర రాష్ట్రాల్లో కూడా రచ్చకు కారణమవుతుండడం విశేషం.