TDP Janasena BJP Alliance: ఏపీలో కూటమికి స్వరూపం వస్తోంది. ఆరేళ్ల తరువాత ఎన్డీఏలో టిడిపి చేరిక ఖాయమైంది. ఈ మేరకు ఢిల్లీ నుంచి స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. గత రెండు రోజులుగా ఢిల్లీలో చంద్రబాబుతో పాటు పవన్ ఉన్న సంగతి తెలిసిందే. బిజెపి అగ్రనేతలతో భేటీ అయిన విషయం విధితమే. పొత్తుతో పాటు కీలక సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. గురువారం రాత్రి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, పవన్ బిజీ షెడ్యూల్ తో గడిపారు. అర్ధరాత్రి వరకు జేపీ నడ్డా, అమిత్ షా తో చర్చించారు. మళ్లీ శనివారం ఉదయం మరోసారి చర్చలు జరిపారు. దీంతో సీట్ల సర్దుబాటు, పొత్తు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది.
ఆ పార్టీ సీనియర్ నాయకుడు కనకమెడల రవీంద్ర కుమార్ పొత్తు ఖరారు అయినట్లు ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుందని స్పష్టం చేశారు. సీట్ల సర్దుబాటుపై ఒక ప్రకటన వస్తుందని చెప్పుకొచ్చారు. మరోవైపు చంద్రబాబు ఢిల్లీ నుంచి టిడిపి కీలక నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పొత్తులపై చర్చించారు. పొత్తులో భాగంగా బిజెపికి ఆరు ఎంపీ స్థానాలతో పాటు ఐదు అసెంబ్లీ స్థానాలను కేటాయించినట్లు చెప్పారని తెలుస్తోంది. అటు జనసేన, ఇటు టిడిపికి సీట్లు సర్దుబాటు చేయాల్సి ఉన్నందున.. అసంతృప్తులతో నేరుగా మాట్లాడాలని టిడిపి సీనియర్ నేతలకు చంద్రబాబు పురమాయించినట్లు సమాచారం. అయితే సాయంత్రానికి పొత్తు ప్రకటన వస్తుందా? లేకుంటే సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత వస్తుందా? అన్నది చూడాలి.
గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. అప్పటినుంచి ఎన్డీఏలోకి ప్రవేశించేందుకు దాదాపు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికే జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. అయితే బిజెపి కలవకూడదన్నది వైసిపి ఆరాటం. ఈ క్రమంలో ఎన్డీఏకు దగ్గరయ్యేందుకు జగన్ సైతం ప్రయత్నించినట్లు ప్రచారం జరిగింది. తీవ్ర తర్జనభర్జన నడుమ బిజెపి తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం విశేషం. అయితే టిడిపి అవసరాలను గమనించిన బిజెపి భారీగా సీట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. దాదాపు 9 పార్లమెంట్ సీట్లు, 10 వరకూ అసెంబ్లీ సీట్లను బీజేపీ కోరినట్టు సమాచారం. అయితే పార్టీల బలాల మేరకు సీట్ల సర్దుబాటు జరిగిందని.. బలానికి మించి ఆశిస్తే అది వైసీపీకి ప్రయోజనం చేకూరుస్తుందని.. మూడు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే టిడిపి అనుకూల మీడియా బిజెపికి తక్కువ స్థానాలు ఇస్తున్నట్లు చెబుతుండగా.. బిజెపికి భారీగా స్థానాలు కేటాయించినట్లు వైసిపి అనుకూల మీడియా చెబుతోంది. దీనిపై ఆ రెండు పార్టీల నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు ఈ ఊహగానాలు కొనసాగుతూనే ఉంటాయి. అయితేచంద్రబాబు ఈరోజు తిరిగి రాష్ట్రానికి రానున్నారు. అయితే ఈరోజు ప్రకటన చేస్తారా? లేకుంటే అమావాస్య దాటిన తర్వాత సోమవారం ప్రకటిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.