AP politics turning point: ప్రతి రాజకీయ పార్టీకి, నాయకుడికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అదే ఎనలేని కీర్తి తెస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ( AP deputy CM Pawan Kalyan )సైతం అదే మాదిరిగా ఒక ఘటన టర్నింగ్ పాయింట్ అయింది. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో చంద్రబాబు అరెస్టు జరిగిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కు సంబంధించి చంద్రబాబును అరెస్టు చేశారు. అనేక రకాల కేసులు నమోదు చేశారు. దాదాపు 52 రోజులపాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబును పరామర్శించి తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటన చేశారు. ఇది ఏపీ రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణం అయ్యింది. అయితే అంతకంటే ముందే చంద్రబాబు అరెస్టు జరిగిన మరుక్షణం పవన్ కళ్యాణ్ నేరుగా హైదరాబాదు నుంచి విమానంలో విజయవాడ వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురు కావడంతో రోడ్డు మార్గం గుండానే విజయవాడ బయలుదేరారు. ఆ సమయంలో రాష్ట్ర సరిహద్దులో ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. జనసేన కార్యకర్తల పై లాఠీచార్జి చేశారు. సరిగ్గా ఈ ఘటన 2023 సెప్టెంబర్ 9న జరిగింది. ఇదే పవన్ కళ్యాణ్ లో కసిని పెంచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెకిలిస్తానని పవన్ కళ్యాణ్ శపధం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే కూటమికి సెప్టెంబర్ 9 ఒక టర్నింగ్ పాయింట్.
చంద్రబాబు అరెస్టుతో..
కర్నూలు జిల్లా( Kurnool district) పర్యటనకు వెళ్లిన చంద్రబాబును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడ తీసుకొచ్చారు. ఆరోజు విమానంలో విజయవాడ వచ్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే వైసీపీకి అనుకూలమైన ప్రభుత్వం తెలంగాణలో ఉంది. అందుకే విమానంలో వచ్చేందుకు పవన్ కళ్యాణ్ కు అనుమతి ఇవ్వలేదు. మమ్మల్ని ఎవరు రా ఆపేది అంటూ పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరారు. భారీ కాన్వాయ్ తో విజయవాడ చేరుకునే క్రమంలో.. ఏపీ, తెలంగాణ సరిహద్దులో ఏపీ పోలీసులు పవన్ కళ్యాణ్ ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ రోడ్డుపై పడుకుని బైఠాయించారు. ఈ క్రమంలో జనసైనికులు తీవ్ర ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చింది. అయితే ఈ ఘటనతోనే పవన్ కళ్యాణ్ తీవ్ర కలత చెందారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధపడ్డారు. ఆ తరువాత నేరుగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును కలిశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు. బిజెపిని సైతం ఒప్పించి కూటమిలో చేరేలా చేశారు. ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి ప్రభంజనం సృష్టించాయి.
అదో టర్నింగ్ పాయింట్..
ఆ ఘటన జరిగి రెండేళ్లు అవుతున్న క్రమంలో.. టర్నింగ్ పాయింట్( turning points ) అంటూ సోషల్ మీడియాలో నాటి పవన్ కళ్యాణ్ ఆందోళన దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. 2023 సెప్టెంబర్ 9న జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోలతో జనసైనికులు పోస్టులు పెడుతున్నారు. అయితే నాడు పవన్ కళ్యాణ్ విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేక తప్పిదాలకు పాల్పడింది. ఆయన విశాఖ పర్యటనను అడ్డుకుంది. మూడు రోజులపాటు ఆయనను హోటల్ కి పరిమితం చేసింది. విశాఖ ఎయిర్పోర్టులో అయితే జన సైనికులకు అప్పటి మంత్రులు కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో వివాదం చోటుచేసుకుంది. జనసైనికుల పై కేసులు నమోదయ్యాయి. చివరకు సామాన్య మహిళలపై సైతం కేసులు నమోదు చేశారు. అప్పటికే వైసీపీపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే చంద్రబాబు అరెస్టు జరగడం, ఆయన పరామర్శకు వస్తున్న పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవడం నిజంగా కూటమికి టర్నింగ్ పాయింట్.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మూల్యం.