Pawan Kalyan: తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణలో భాగంగా తాడేపల్లిగూడెం, పత్తిపాడు లో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఉభయ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. పవన్ కళ్యాణ్ స్పీచ్ ఆకట్టుకుంది. రెండు పార్టీల శ్రేణులను ఆలోచింపజేసింది. సిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం ఖాయమని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇన్ని సీట్లేనా అని రెచ్చగొడుతున్న వైసిపి వారికి వామనుడి ఉదాహరణ చెప్పి తొక్కి పడేయబోతున్నామని తేల్చి చెప్పారు. సూటిగా, సుత్తి లేకుండా అన్ని అంశాలపై స్పష్టతను ఇచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు సీనియారిటీని, సిన్సియార్టీని, పట్టుదలను మరోసారి గుర్తు చేశారు. 2003లో అలిపిరి ఘటనను గుర్తు చేశారు. చంద్రబాబు పై హత్య ప్రయత్నం జరిగినప్పుడు.. ఆయన కారు 16 అడుగుల ఎత్తుకు ఎగిరి పడినప్పుడు.. మొండి పట్టుదలతో ప్రజల కోసం చంద్రబాబునాయుడు బయటపడ్డారు అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇది టిడిపి శ్రేణులను ఎంతగానో ఆకట్టుకుంది. ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగకూడదని.. వైసిపి ఎన్నో రకాల కుట్రలు చేస్తోంది. దానిని అధిగమించే ప్రయత్నంలో భాగంగా.. టిడిపి శ్రేణులను ఆకట్టుకునేందుకే పవన్ ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ సభల్లో పవన్ హావ భావాల నుంచి చేసిన ప్రసంగం వరకు అన్ని ప్రత్యేకతగా నిలిచాయి. సుదీర్ఘంగా మాట్లాడినా ఎక్కడా మాట పొల్లు పోలేదు. సూటిగా స్పష్టంగా తన సందేశాన్ని క్లియర్గా అన్ని వర్గాలకు పంపారు. అటు జగన్ కు, ఇటు ప్రజలకు, మరోవైపు సొంత పార్టీ నేతలకు సందేశం ఇచ్చారు.బాలకృష్ణ ప్రసంగం ప్రారంభించే సమయంలో.. అతని వద్దకు వచ్చి ఇద్దరూ ప్రజలకు విజయ సంకేతాలు పంపారు. సాధారణంగా పవన్ ప్రసంగాల్లో జంపింగ్ ఎక్కువ ఉంటాయి. ఒక అంశం నుంచి మరో అంశానికి ఇట్టే వెళ్లిపోతారు. కానీ నిన్నటి సభలు అలా జరగలేదు. ఓ ఫ్లోలో ముందుకు సాగారు. తాను చెప్పాలనుకున్నది క్లియర్ గా తేల్చి చెప్పారు. జనసేన కార్యకర్తలను రెచ్చగొడుతున్న వైసీపీ వారికి కౌంటర్ ఇచ్చారు. తనపై వ్యక్తిగత విమర్శలను తిప్పికొట్టారు. నలుగురు పెళ్ళాలంటూ జగన్ మాట్లాడుతుంటారని.. నాలుగో పెళ్ళం నువ్వేనంటూ… నీకు కరెక్ట్ మొగుడిని నేనే అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
సొంత పార్టీలో ఉండి విమర్శలకు దిగుతున్న వారికి కరెక్ట్ సమాధానం చెప్పారు. సలహాలు ఇవ్వొద్దని తన వెంట నడవాలని సూచించారు. పదేళ్లుగా అవమానాలు పడుతూ రాజకీయాలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. తాను ఏం చేయాలో స్పష్టత ఉందన్నారు. తనను ప్రశ్నించకుండా తనతో పాటు నడిచే వారే తనవారని తేల్చి చెప్పారు. జనసేనలో ఉన్న ప్రో వైసిపి నేతలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. తాను టిడిపి వెనక్కి నడవడం లేదని.. టిడిపి తో కలిసి నడుస్తున్నానని తేల్చారు. అలిపిరి ఘటనను గుర్తు చేస్తూ చంద్రబాబు అనుభవాన్ని పొగిడారు. తెలుగుదేశం పార్టీకి ఉన్న సమస్త గత బలాన్ని గుర్తు చేశారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాను పొత్తు పెట్టుకున్న విషయాన్ని ప్రస్తావించారు. మొత్తానికైతే పవన్ ప్రసంగానికి జనసేన కంటే టిడిపి శ్రేణులు ఫిదా అయ్యాయి.