Pawan Kalyan: తెలుగులోనే టాప్ హీరో పవన్ కళ్యాణ్. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయన సొంతం. తెలుగు సినీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న వేళ… ఏ హీరో చేయని సాహసం పవన్ చేశారు. ప్రజాసేవ కోసం జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ ఏర్పాటు చేసి సుదీర్ఘకాలం అవుతున్నా.. సరైన విజయం దక్కకున్నా పార్టీని నడుపుతున్న ఒకే ఒక నాయకుడు పవన్. ఇంతవరకు పవర్ పాలిటిక్స్ సాధించలేకపోయారు కానీ.. ఒక పొలిటికల్ పార్టీని సక్సెస్ ఫుల్ గా, తన సొంత ఖర్చుతో నడిపిన ఘనత మాత్రం పవన్ కళ్యాణ్ కే దక్కుతుంది.
ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో ఒక రాజకీయ పార్టీని నడిపించడం అంత సులువు కాదు. ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రశ్నార్ధకమవుతున్న వేళ.. సరైన విజయం దక్కకున్నా.. దాదాపు పది సంవత్సరాల పాటు పార్టీని నడపడం పవన్ కే సాధ్యమైంది. ఒక్క పార్టీని నడపడమే కాదు.. కార్యకర్తల కోసం బీమా, కౌలు రైతు కుటుంబాలకు సాయం, విపత్తుల సమయంలో ప్రభుత్వానికి వితరణలు.. ఇలా ఎలా చూసుకున్నా పవన్ విషయంలో అన్ని ప్రత్యేకతలే. అయితే పార్టీ కోసం సినిమాల్లో నటించే ఏకైక నటుడు కూడా పవన్ కళ్యాణ్ కావడం విశేషం.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంది. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పోటీ చేయనుంది. దాదాపు కొత్తవారినే అభ్యర్థులుగా పవన్ ప్రకటించారు. అయితే వైసిపి ప్రత్యర్థిగా ఉంది. భారీగా ఖర్చు చేస్తుందన్న ప్రచారం ఉంది. అందుకు తగ్గట్టుగా జనసేన అభ్యర్థి ఖర్చు చేయగలరా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వాస్తవానికి పవన్ తన సొంత డబ్బులతోనే పార్టీని నడుపుతున్నారు. కొన్నాళ్ల కిందట నిర్మాతల దగ్గర తీసుకున్న రెమ్యూనరేషన్ తో పవన్ పార్టీని నడుపుతూ వచ్చారు. అటు రాజకీయాల్లో సమయం చూసుకుంటూ సినిమాల్లో నటిస్తూ వచ్చారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయ చేయడం అవసరమా అని పవన్ ను మేము ప్రశ్నించామని పలు సందర్భాల్లో ప్రశ్నించామని మెగా బ్రదర్ నాగబాబు చెప్పుకొచ్చారు.
అయితే పార్టీ కోసం, పార్టీ అవసరాల కోసం పవన్ చాలా ఆస్తులను అమ్ముకున్నారని.. చివరకు పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకులో ఉన్న నగదును సైతం తీసి ఖర్చు చేశారని ప్రచారం ఉంది. గతంలో అవసరాల కోసం హైదరాబాదులో ఉన్న మన సొంత ఇంటిని సైతం విక్రయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా ఎన్నికల్లో పార్టీ అవసరాల కోసం హైదరాబాదులో తన పేరుతో ఉన్న రెండు స్థలాలను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియాల్సి ఉంది. కానీ ఆయనపై లేనిపోని దుష్ప్రచారం చేయడాన్ని హార్డ్ కోర్ అభిమానులు సహించలేకపోతున్నారు. పార్టీ కోసం సొంత ఆస్తులను, సంపాదించుకున్న సొమ్మును ఖర్చు పెడుతున్నారంటే.. అంతకంటే నిజాయితీ మరొకటి ఉంటుందా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే పవన్ పార్టీ కోసం సొంత ఆస్తులను అమ్ముకోవడం విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.